కవిస్వరం: నేనిప్పుడు సగటు మనిషినే

కవి సంగమమంలో వస్తున్న కవితల్లో ఈ వారం దయానంద రావు కవిత "నేనిప్పుడు సగటు మనిషినే" ప్రత్యేకంగా కనిపించింది. వస్తువు పాతదే, వ్యక్తీకరణ కొత్తది కావడం ఈ కవితలో చూస్తాం. దయానంద రావు సగటు మనిషిని మధ్యతరగతి మనిషిగా భావించినట్లు అనిపిస్తుంది. ఒకవేళ అతను అలా భావించకపోయినా అది అదే. ఇప్పటి వరకు మధ్యతరగతిని గొంగళిపురుగుతో పోల్చి సమాజంలో పనికి రాని సమూహంగా చిత్రీకరిస్తూ వచ్చారు.

ప్రపంచం సంగతేమో గానీ తెలుగు సమాజంలో మధ్యతరగతి సమాజం విస్తరించింది. సంపదను కూడబెట్టుకున్నప్పటికీ చాలా మంది మధ్యతరగతి మనస్తత్వానికి, జీవన విధానానికి దూరం కాలేని ఓ పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే, దయానంద రావు కవితలో ఓ కన్ఫెషన్ ఉంది. ఆ కన్ఫెన్షన్ నేను ఇలాగే ఉంటానని చెప్పడం. అది మధ్యతరగతి వ్యక్తి అధికారిక ప్రకటన కూడా. ఆ రకంగా చూసినప్పుడు పాత వస్తువును ఆయన కొత్తగా చూపించినట్లు అర్థం చేసుకోవచ్చు.

ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ మగశిశువు పరిణామక్రమం ఈ కవితలో ఉంది. ఆ పరిణామంలో ఆనందాలూ విషాదాలూ సమాన స్థాయిలో ఉంటాయి. ఏ మాత్రం ఈసడింపు ప్రదర్శించకుండా దాన్ని దయానంద రావు ప్రేమతో వ్యక్తీకరించడం ఈ కవితలోని సానుకూల విషయం. మధ్యతరగతి వ్యక్తిని ఇప్పటి వరకు చాలా మంది కవులు, రచయితలు అతను కలల ప్రపంచంలో, ఊహాలోకంలో విహరించేవాడిగా, వాస్తవ ప్రపంచంలో అసమర్థుడిగా, అసహాయుడిగా చిత్రీకరించారు. తనకే కాదు, సమాజానికి కూడా పనికి రాడనే పద్ధతిలో అతన్ని ఓ పంజరంలో బంధించారు.

ఆ పంజరాన్ని మధ్యతరగతి జీవి ఛేదిస్తున్నాడు. ఆ మెలుకువ లేదా చైతన్యం దయానంద రావుకు ఉందని చెప్పలేం గానీ సమాజంలో ఇప్పుడు వస్తున్న ప్రజాస్వామిక ఉద్యమాల్లో మధ్యతరగతి పాత్ర, మధ్యతరగతి మేధావుల చొరవ, క్రీయాశీలత దయానంద రావు కవితలో స్పర్శామాత్రంగా, అజ్ఞాతంగా కనిపిస్తుంది. అందుకే ఈ కవిత పాత వస్తువును తీసుకుని కొత్త అభివ్యక్తికి ప్రతీకగా నిలుస్తుందని నేను మొదటి చెప్పినదాన్ని మరోసారి చెబుతూ..

- కాసుల ప్రతాపరెడ్డి

 Kavisangamam poet: Dayananda Rao on middle class

నేనూ అందరిలా
తల్లిపేగు బంధాన్నితెంచుకుని
బాహ్యప్రపంచంలోకి వచ్చిన వాడినే..!

దోగాడుతూ
అమ్మానాన్నల చిటికెన వ్రేళ్ళని పట్టుకుని
అడుగులువేయడం నేర్చుకున్న వాడినే..!

చిలిపిపనులు చేసినపుడు
ముద్దుగా గోరుముద్దలు పెట్టిన
చేతుల్లో గుద్దుల్ని తిన్నవాడినే..!

అందరిపిల్లల్లా
మనసు వెనక్కి మారాం చేస్తుంటే
పలకాబలపం పట్టి బడికి కాళ్ళీడ్చిన వాడినే..!

ఆటపాటల్లోనే
చక్రంలా వడిగా తిరిగిన కాలంలో గడిపి
కనురెప్పలు విచ్చుకున్న వాడినే..!

లాగుల్లోంచి కాళ్ళు
గొట్టపు ప్యాంటుల్లోకి మారినరోజుల్లో
రెండించుల మేర ఛాతీని ఉప్పొంగించిన వాడినే..!

యవ్వనపు దశల్లో
కలలకాసారంలో ఈదుతూ
యవనికల్లేని స్వప్నాల్ని అందుకున్న వాడినే..!

అలికిడిలేని సమయంలో్
అయ్యపారేసిన కరుకు బీడీలతో
పొగలు పారిస్తూ పరవశం పొందిన వాడినే..!

కబుర్లూ కాలక్షేపాలతో
కలకాలం నిలిచే స్నేహాల్ని
కనబడకుండా కన్నులో దాచుకున్న వాడినే..!

కంటికింపైన రూపాల్ని
కాంక్షిస్తూ, ప్రేమిస్తూ
స్వప్నలోకాల్లో విహరించిన వాడినే..!

కృష్ణశాస్త్రి ' కృష్ణపక్షం ' లో
తిలక్ ' అమృతం కురిసిన రాత్రుల్లో '
యండమూరి ' వెన్నెల్లో ఆడపిల్ల ' తో తిరిగిన వాడినే..!

ప్రేమదీపాన్ని వెలిగించుకుని
తిరస్కార సమీరాలతో చెలరేగిన
విరహపు జ్వాలల్లో హృదయాన్ని కాల్చుకున్న వాడినే..!

తిండికిలేని పేదరికంలో్
కరువేలేని కన్నీళ్ళతో
కష్టాలకాళ్ళని కడిగిన వాడినే..!

బ్రతుకు బజారున పడే రోజుల్లో
బంధువులు కాదని స్నేహబంధాలు హత్తుకున్న
హస్తాల స్పర్శని గుర్తుంచుకున్న వాడినే..!

మతితప్పే కాలంలో్
గతి తప్పనివ్వని
వివాహబంధంతో ముడివేయబడిన వాడినే..!

భరించేవాడే
భర్తన్నదేమో కానీ
నన్ను ' సర్వం ' భరించే భార్యకలిగిన వాడినే..!

పల్లవించే తరువులతో
పుడమి పులకరించిన రీతి పుత్రికారత్నాలతో
' తండ్రన్న' వెలుగుల్ని పొందుతున్న వాడినే..!

సాపాటు కోసం
దొరికిన దుప్పటిలో కాళ్ళుజాపుకుని
సర్కారు కొలువుని సాగిస్తూన్న వాడినే..!

అప్పుడప్పుడు రాలే
ఆనందానుభూతుల చుక్కల్ని
మనసుదోసిళ్ళతో పట్టి గుండెలో దాచుకునే వాడినే..!

ఎగరాలని ఉవ్విళ్ళూరే
మనసురెక్కల్ని మడతబెట్టి
తనువుని నత్తకర్పరంలో తోసుకున్న వాడినే..!

గీయబడిన జీవనకక్ష్యలో
కుంటుతూనో, కుప్పిగంతులేస్తూనో
పరిగెడుతూన్న ' సగటు మనిషినే ' .........!

- దయానంద రావు
తేది: 12-10-2014

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+