కవిస్వరం: ప్రేయసీ -13

పొద్దున్న తండ్రి ముఖాన్ని దుఖ్కంతో కడుక్కుంటాడని ఉత్తరాంధ్ర మాండలికంలో అత్యంత సహజంగా పలికిన ఈ కవే ప్రేయసితో ఆత్మీయతను కూడా అంతే మమకారంతో, ఆత్మీయంగా వ్యక్తీకరించాడు. ప్రేయసీప్రియులు మాట్లాడుకోకుండా గంటలను క్షణాలుగా గడిపేసే మధురానుభూతులను కాశిరాజు ఈ కవితలో వ్యక్తీకరించాడు. దీనికి అతను ప్రేయసి - 13 అని పేరు పెట్టాడు. మరో 12 ప్రేయసి కవితలు రాసే ఉంటాడని నేను అనుకుంటూ ఉంటాను.
బంధాలు నిలబడాలంటే బలహీనతేదో కట్టి ఉంచాలనే కాశిరాజు వ్యక్తీకరణ కొత్తదీ, ఆత్మీయమైంది కూడా. ఏమీ తెలియనట్లుగా 'ఒకరివైపొకరు/ ఏం కోరి చూస్తారో ఏ మాత్రమూ తెలీక/ మాటల్ని కోల్పోవడమే పనేపోవాలి' అని పలికే కాశిరాజు చరణాల మధ్య గడుసుదనం కూడా ఉంది. మొదటి స్టాంజాలో భౌతికమైనవాటిని వివరిస్తూ గుండెకు కాస్తా దగ్గరగానో కొద్దిసేపైనా కూర్చోవడం తెలియాలి అంటాడు కవి. ఇక్కడే అతని గడుసుదనం బయటపడుతుంది. మనసుకూ మనసుకూ మధ్య ఆత్మీయతలు కలవాలనేది ఆయన సూచన కావచ్చు.
ఈ కవితలో కవి పూర్తిగా అమాయకుడిగా మారిపోవడం బాగుంది. తనలోని జ్ఞాన సంపదని మరిచిపోయి కవి ఏమీ తెలియనివాడిలా మారిపోయి తనలోని భావాలను పోత పోశాడు. లెర్నింగ్ నుంచి అన్ లెర్నింగ్‌లోకి అడుగు వేశాడు. కవిత్వానికి కావాల్సింది అదే. కవిత్వానికే కాదు, సృజనాత్మక ప్రక్రియకు దేనికైనా అది అవసరమే. కవి తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ పోతే కవిత డాంబికంగా మారిపోయి, పాఠకులకు దూరమవుతుంది. ఈ డాంబికాలకు దూరంగా ఉండడంలోనే కాశిరాజు కవితా నిర్మాణ పద్ధతి, అభివ్యక్తి తీరు ఆత్మీయంగా మారిపోతుంది. గంభీరమైన వస్తువును తీసుకుని రాసిన కాశిరాజు కవితల్లో కూడా ఆ లక్షణం కనిపిస్తుంది. కావాలంటే అతని కవితలను అన్నింటినీ ఓసారి పరిశీలించవచ్చు.
- కాసుల ప్రతాపరెడ్డి
కొద్ది సేపైనా కూర్చోవడం తెలియాలి
గుట్టమీదో , గుడి మెట్టుమీదో
గుండెకు కాస్త దగ్గరిగానో
ఒకరి వైపొకరు
ఏం కోరి చూస్తారో ఏ మాత్రమూ తెలీక
మాటల్ని కోల్పోవడమే మన పనైపోవాలి
బంధాలు నిలబడాలంటే
బలహీనతేదో మనల్ని కట్టి ఉంచేయాలి
ప్రేయసీ
కాలానికి కలిసి కూర్చోవడం నేర్పేసాక
గుండెల్ని గుట్టుగా దాచేసుకోవాలి
- కాశి రాజు
22/01/2014
కవిసంగమం కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications