• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంచు తుఫాను..చెదురుమదురు వర్షం.,

By Pratap
|

Kavitha: Rama Chandra Mouli's new poem
ఈ కుక్కొకటి వెంట నిరంతరం నీడవలె

ఎక్కడిదో .. శరీరంవెంట ఆత్మలా సహచరిస్తూ

పరిచయాలవసరంలేదు .. సాహచర్యం చాలేమో కలిసి నడవడానికి

మనిషి మనిషితో తారసపడ్డం

ఒక అసంకల్పిత ఘటన . . దారులు చటుక్కున కలిసి వియుక్తమౌతాయి

చూపులేమో ఎక్కడో

ఆకాశానికవతల సుదూర గమ్యంపై సాంద్రిస్తూ

లాగాలి..లాగాలి అల్లెతాడును ఆకర్ణాంత పర్యంతం

బాణం వెనక్కి వెనక్కి తిరోధృతిలో తపస్సిస్తున్నంతసేపూ

లోపలినుండి ఏదో ఒక గరిష్ఠ అదృశ్యశక్తి గర్జిస్తూ గర్జిస్తూ

సర్ ర్ ర్ ర్ ర్ న విముక్తం కాగానే

లక్ష్యఛేదనే .. తప్పనిసరిగా చేజిక్కే విజయం

బ్రద్దలయ్యే ఖాళీ సీసా

చుట్టూ ఎడతెగని చప్పట్ల మ్రోత .. నిషా ఆవరిస్తున్న మంచుతెరవలె

ఎలా జయించగలవు నిన్ను నువ్వు

అసలు నువ్వెవరో నీకే తెలియనపుడు -

మహాభినిష్క్రమణలో ధర్మరాజు పొందాడా కోల్పోయాడా దేన్నైనా

తెలియని దారిలో పయనిస్తూ

మనిషి క్రమంగా కూలిపోవడం .. తొలగిపోవడం .. పరాయైపోవడం

అంతిమంగా మనుషులందరూ ఒట్టి భ్రాంతి అని స్పష్టపడి

ఎవనికి వాడు పునరాన్వేషణలో.. పరి-శోధనలో మగ్నమైనపుడు

చివరికి విజయాలూ , లక్ష్యసాధనలూ .. స్వర్గారోహణలూ .. అన్నీ

ఒట్టి చెత్తకుండీలో ట్రాష్

సకల బంధాబంధాలన్నీ సాపేక్షాలై పునర్నిర్వచించబడ్తున్నపుడు

చివరికి కుక్కొకటే విశ్వాసానికి ప్రతీకా .?

2

ఒంటరిగా మిగలడం ఇక తప్పదని నిర్ధారణైన తర్వాత

కలసి నడచివచ్చిన సహయాత్రీకుల ఉనికికి విలువేమిటన్నది ప్రశ్న

చెట్టుకొమ్మనుండి కాయ విడివడ్డ తదనంతరం

గమనాగమనాలన్నీ ఖండాంతర వ్యాపారవస్తు పరిగణనలే

అంతా "ఏమిస్తావ్ .. ఏం తెస్తావ్ "అన్న ధర్మ మీమాంస

మనిషి 'మా ' నుండి ' నా' దాకా పతనం

' మన ' అన్న స్పృహే అస్సలు లేదు

చటుక్కున ఆగి వెనుదిరిగి చూస్తే

అప్పటిదాకా వెంట నడచివచ్చిన కుక్క లేదు

శూన్యం లో నుండి శూన్యాన్ని తీసేస్తే మళ్ళీ శూన్యమే మిగుల్తూ

ఒకటికి అటుప్రక్క ఒక సున్నా..ఇటుప్రక్క ఒక సున్నా నవ్వుతున్నపుడు

మధ్యలో ఒంటరిగా మిగిలిన

ఒకటి విలువెంత.?

అతను విలువల గురించి ఆలోచిస్తూ.. నడుస్తూ

వెంట కుక్క నడచి వచ్చీ వచ్చీ .. మాయమై.. లేకపోవడ మనే మీమాంసలో

అనులోమ విలోమాల లోతులను అనుశీలిస్తూ .,

ఆ క్షణం అతనిముందు . . గమ్యమే కనిపించట్లేదు

అంతా .. మంచుతుఫాను . .చూపులు ఘనీభవిస్తూ,

అంతటా చెదురుమదురుగా వర్షం -

- రామా చంద్రమౌళి

English summary
An eminent Telugu poet Rama Chandra Mouli describes emotions of human beings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X