• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు కవిత: కనుదోయి ఒక రాయి

By Pratap
|

జీవితం

ఇక్కడ

పగటి ఎండై పగులుతుంది

రాత్రి చీకటై విరుగుతుంది

ఉదయపు సూది మొన మీద నిదురలేస్తుంది

కార్చిచ్చు కంచెల వలయంలో

ఊపిర్లు బిగబట్టిన గొంతు చివర

మొనదేలిన నినాదం

తెగని సంకెళ్ళను

కరిగించే పెనుగులాటల్లో

ప్రాణం కసి వర్షమై శత్రువు మీద కురువడమో

తెల్లటి మంచుమీద నెత్తుటి చాదర్గా ఓ యువకుడి గుండె పరచబడ్డమో

యవ్వనం చేజారుతున్న సంఘటనల మధ్య కనుగుడ్లు సూర్యగోళాలై పగలడమో

గతిశీలతకు

వజ్రసంకల్పం తోడైనపుడు

ప్రాణం ధిక్కార దేహాన్ని చెక్కుకుంటుంది

Mahmood Telugu poem Kanudoyi Oka Raayi

*****

పోరాటం ప్రారంభమైన చోట

దీర్ఘంగా బతుకును శ్వాసిస్తావు

పోరాటం అనివార్యమైన చోట

బతకాలనే కోరిక మీద విజయం సాధిస్తావు

నీకు తెలియకుండానే నీ దేహం ముక్కలై పోతుంది

నీకు తెలియకుండానే నీ చూపు నీ కనుగుడ్డు మీది నుంచి జారిపడి గలగిలాతన్నుకుంటుంది

నీకు తెలియకుండానే నీ యవ్వనం నీ చేతుల్నించి జారిపోతుంది

నీకు తెలియకుండానే నీవో వీరుడవౌవుతావు

నీకు తెలియకుండానే నీవో ఉద్యమమౌతావు

నీకు తెలియకుండానే అమరత్వం నీ దేహంపై కఫన్లా చుట్టుకొని జనం నోళ్ళలో నినాదమౌతుంది

నీ జాతి ఛాతిలో వేగంగా కొట్టుకునే గుండెలయవవుతావు

చల్లని చూపుల

పూదోటలను కాదు

నిప్పుల్లేసే

అగ్ని సరస్సుల మీద

గుండెకు మంటలంటించుకుంటావు

దుఃఖానందాల మధ్య

సందిగ్ధపు క్షణాలు నిండిన కాలం చెరువు నీటి మీద

సంతకాల్జేస్తావ్

అరచేతిలో

కళ్ళలా

రాళ్ళను ఒకదానిమీదొకటి తిప్పుతూ

లక్ష్యం మీద గురి పెడతావు

ఆకాంక్షల చెట్టుకు

వేల్లాడే పక్షి గూడు లోపల

ఉక్కపోత రెక్కల్లో ఈకలా

నీ ప్రాణం కొట్టుకులాడుతున్నపుడు

నిట్టనిలువు మంటవై ధగధగలాడతావు

***

రొడ్డు మీది దుమ్ము మేఘాల అసహనంలో

స్వప్నాలని వెదుక్కుంటూ

రెక్కలు అలల్లాడించే క్షతగాత్ర విహంగాల

కన్నీటి చారికల్లో నిన్ను నువ్వు చూసుకుంటావు

ఆశ చావని

ఆత్మగౌరవం

కోల్పోని

చేతులు విసురుకునే

బతుకు బండరాళ్ళ మధ్య నిత్యసైనికుడవై నిలబడతావు

ఖడ్గాలకూ

తూటాలకూ

ముట్టడికీ

లొంగని

కనుదోయి

లేసిన రాతి పిడికిలి రా

కాళ్ళనూ చేతులనూ కట్టిపడేసిన

బందీత్వంలో ఒకరోజు ఖచ్చితంగా

మందుపాతరవై పేలతావు

సైనేడ్ లాంటి చీకటిని పూసుకున్న రాత్రిలో

నేల కనుగుడ్డు మీద

స్వప్నపు గాలి రెప్పలాడిస్తుంది

నిదుర గురించిపుడు అడగనే అడగకు

నేస్తం

దీర్ఘ మెలుకువలోకి సమస్త శక్తులన్నీ ఐక్యం ఐపోయాయి

రెప్పల పక్షులు పెల్లెట్ వేటగాళ్ళ బారిన పడ్డాయి

- మహమూద్

English summary
A Telugu poet Mahmood in his Telugu poem Kanudoyi Oka raayi speaks about movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X