తెలుగు కవిత: వెళ్లిపోతున్నరంతా...
వెళ్ళి పోతున్నరంతా
ఒక్కొరొక్కరే
నిశ్శబ్దంగా
నెమ్మదిగా
యేమీ చెప్పకుండా
పట్టుకున్న వెచ్చని చేతులని
అతి పదిలంగా వదిలిచుకుంటూ

వెళ్ళిపోతున్నరంతా -
ఒకరు వీడిన కన్నీరు ఇంకా ఆరనే లేదు
మరొకరు,
కన్నీటి చుక్కల్ల్ని పొడుస్తూ
నిర్దయగా ....
ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకున్న పాదాలకు
అనునయంగా పిలుపు లేపనం పూసినోళ్ళు
కన్ను పొడిసే చీకట్లల్ల
పురుగూ బూసి కరువకుండ జాగ్రత్తల దీపాలైనోళ్ళు
పెచ్చులూడిన గోడలమీద
వెలిసిపోయిన రంగులని వెతుక్కుంటున్నప్పుడు
మెరిసిన జాజి రంగు నినాదాలైనోళ్ళు
కష్టమైనా నష్టమైనా వెన్నంటే ఉంటామని
కొండంత అండైనోళ్ళు
వెళ్ళిపోతున్నరంతా
బయటికి రాని శోకాన్ని పుట్టెడు దుఃఖాన్ని
మన గొంతుల్లో మిగిలించి .....
యెడతెరపిలేకుండా
యెన్నో వెలుతురు ముచ్చట్లు చెప్పి
యెట్లా బతకాలో బతికి చూపించినోళ్ళు
కలలెందుకు కనాలో,
కంట్లోనూ మనసులోనూ
తడి యెందుకు యింకిపోవద్దో
యెన్ని పోగొట్టుకున్నా
యెన్నడూ మనిషితనం పోగొట్టుకోవద్దని
శిథిలమైన బతుకుగోడల మధ్యా
చెదరని చిరునవ్వుతో చెప్పినోళ్ళు
ఒక్కొరక్కరే వెళ్ళిపోతున్నారు
నిశ్శబ్దంగా....
నెమ్మదిగా తలలూపే చెట్లలాగా
పొద్దుటి పూట చెమ్మగిల్లిన పూల లాగా
లేత యెండలో మెరిసే చిగురుటాకుల్లా
నెరవేరని కలలనీ
అలుపెరుగని చిరునవ్వులనీ
మనకు మిగులుస్తూ...
వెళ్ళిపోతున్నరంతా ....
- నారాయణ స్వామి వెంకటయోగి












Click it and Unblock the Notifications