కవిత: ఒకానొక హిప్నాటిక్ ఏడుపులోకి..
రెండుగంటల్రాత్రి
అంతర్బాహిర్లోకాలనడుమ అనాత్మగా సoచరిస్తుంటే
ఆత్మీయ మిత్రుడి ఆఖరి ప్రశ్నొకటి
దేహసరిహద్దుల్లోకి వెచ్చగా గిరాటేయబడి..
(అసల్నీకేం కావాలనీ,
ఏం కోల్పోయావనీ ఏడుపు రాత్రిళ్ళనీ.)
సమాధానం వెతకలేక
మిణుగుర్ల నీడన క్లేశాలకు ఉరేస్కున్న ఆత్మీయుడికి
కన్ను కారుస్తున్న రుజినాన్ని అభిషేకించి
చంద్రుడ్ని దొర్లించడానికి కాంతివృక్షమ్మీదికెక్కి..
ఏం జరుగుతుంది బుధ్దిని శరీరమోడించాక

అవ్నూ
నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నానా అనుసరిస్తున్నానా
సిధ్దార్థుడి భార్యకు ఒక్క దేహలాలసా కలగలేదా ఏడవడానికి
బహుముఖ ఏకాంతాల్లో సంయోజించుకోడానికి..
చెకుముకిరాళ్ళ నడుమ
విస్ఫులింగమయ్యేంత భాషలేని బాహాబాహీ
బాహ్యానికీ ఆంతర్యానికీ..
ఎంతమందికి చేతవును
దుఃఖాన్ని దుఃఖంతో సుఖించడం..
ఎలాంటి పేచీల్లేవ్
ఆకలిగా తొడలమధ్య బ్రతికేవాడ్తో..
గొడవంతా కడుపునిండిన గాయాల్ని
వొంటిమీద చల్లుకుని
ఎడార్లో మరీచికల్ని మొలిపించుకోగలిగేవాళ్ళతోనే..
అంటే
నాతో నాకేనా
దేహంతో కాలానికేనా గొడవ
- వంశీధర్ రెడ్డి












Click it and Unblock the Notifications