Swift Observatory: భూమి వైపు దూసుకొస్తున్న భారీ శాటిలైట్, NASA ఎంట్రీ
విశ్వ గర్భంలో మెరుస్తున్న గామా కిరణాల రహస్యాలను రెండు దశాబ్దాలుగా వెంబడిస్తున్న ఒక అంతరిక్ష వీరుడు... ఇప్పుడు తానే భూమి ఆకర్షణకు చిక్కుకున్నాడు! నాసా 'నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ' (Neil Gehrels Swift Observatory) అనూహ్యంగా తన కక్ష్యను కోల్పోయి క్రమంగా భూమి వైపు దిగివస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫిబ్రవరి ప్రారంభం నాటికి, 585 కిలోమీటర్ల ఎత్తులో ఉండాల్సిన ఈ నౌక, కేవలం 400 కిలోమీటర్ల దిగువకు చేరుకుంది.
ఖగోళ శాస్త్ర చరిత్రలో ధ్రువతారగా నిలిచిన 'నీల్ గెహ్రల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ' (Neil Gehrels Swift Observatory) మనుగడ కోసం నాసా ప్రస్తుతం ఒక ఉత్కంఠభరితమైన అంతరిక్ష యుద్ధం చేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా విశ్వపు లోతుల్లోని బ్లాక్ హోల్స్ పుట్టుకను, నక్షత్రాల అంతిమ ఘడియలను పర్యవేక్షిస్తున్న ఈ కీలక అబ్జర్వేటరీ, ఇప్పుడు 'సౌర చక్రం 25' (Solar Cycle 25) సృష్టించిన వాతావరణ అల్లకల్లోలానికి బలవుతోంది. సూర్యుడు అత్యంత క్రియాశీలంగా ఉండటం వల్ల భూమి ఎగువ వాతావరణం వేడెక్కి వ్యాపించడంతో, 585 కిలోమీటర్ల ఎత్తులో సురక్షితంగా ఉండాల్సిన స్విఫ్ట్, వాతావరణ రాపిడికి గురై వేగంగా భూమి వైపు పడిపోతోంది.

Swift Observatory వల్లే మన ఆలోచన మారింది..
ఈ సంక్షోభం కేవలం ఒక యంత్రానికే కాదు, ఖగోళ విజ్ఞానానికే ఒక సవాల్‌గా మారింది. 2004లో ప్రయోగించిన స్విఫ్ట్, ఇప్పటివరకు 2,000కు పైగా గామా-రే బరెస్ట్‌లను (GRBs) గుర్తించి, విశ్వం గురించి మన అవగాహనను సమూలంగా మార్చేసింది. ప్రస్తుతం 400 కిలోమీటర్ల దిగువకు పడిపోయిన ఈ 1.4 టన్నుల నౌకను కాపాడకపోతే, 2026 చివరి నాటికి ఇది నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి దూసుకొచ్చి కాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నాసా అత్యవసరంగా ఫిబ్రవరి 11, 2026న దీని సైన్స్ కార్యకలాపాలను నిలిపివేసి, కక్ష్యను స్థిరీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది.
చరిత్రలో తొలిసారిగా..
ఈ విపత్తును అవకాశంగా మలచుకుంటూ నాసా ఒక వినూత్నమైన 'స్పేస్ రెస్క్యూ' ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. అరిజోనాకు చెందిన 'కటాలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్'తో కుదుర్చుకున్న $30 మిలియన్ల ఒప్పందం ద్వారా, చరిత్రలో తొలిసారిగా ఒక రోబోటిక్ నౌకను ప్రయోగిస్తోంది. 2026 జూన్‌లో 'లింక్' (Link) అనే ఈ రోబోటిక్ నౌక పెగాసస్ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లి, అంతరిక్షంలో స్విఫ్ట్‌తో డాక్ అవుతుంది. ఇది స్విఫ్ట్‌ను తిరిగి 600 కిలోమీటర్ల ఎత్తులోని సురక్షిత కక్ష్యలోకి చేర్చి, దాని జీవితకాలాన్ని మరో పదేళ్ల పాటు పొడిగించనుంది.
ఎందుకు ఇది కీలకం?
ఈ ప్రయోగం విజయవంతమైతే, అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇదొక 'గేమ్ ఛేంజర్' కానుంది. ఇప్పటివరకు ఇంధనం అయిపోయినా లేదా కక్ష్య తప్పినా ఉపగ్రహాలను అంతరిక్ష వ్యర్థాలుగా వదిలేయడం లేదా సముద్రంలో పడేయడం మాత్రమే చేసేవారు. కానీ ఈ 'రీబూస్ట్ మిషన్' ద్వారా పాతబడిన ఉపగ్రహాలకు తిరిగి ఊపిరి పోయవచ్చని నాసా నిరూపిస్తోంది. ఇది భవిష్యత్తులో భూ కక్ష్యలోని ఆస్తుల నిర్వహణకు ఒక కొత్త మార్గదర్శిగా నిలవడమే కాకుండా, అంతరిక్ష వ్యర్థాల సమస్యను తగ్గించి 'ఆర్బిటల్ సస్టైనబిలిటీ'కి కొత్త అర్థాన్ని ఇవ్వబోతోంది.












Click it and Unblock the Notifications