లెక్క మారుతోంది.. రోజుకి 24 గంటలు కాదు 25.. ఎప్పటి నుంచి అంటే ?
సమయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత విలువైంది. ధనవంతుడికైనా పేదవారికి అయినా కూడా ఎవరికైనా సమయం ఒకటే. ఒక్కసారి గడిచిపోయిన తర్వాత తిరిగి రానిది అంటే సమయమే. అందుకే ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతి క్షణాన్ని ఎంతో విలువైందిగా చూస్తూ వృధా చేసుకోవద్దని అంటుంటారు. అయితే కాలగణన ప్రకారం సమయాన్ని గంటల్లో లెక్కిస్తూ రావడం ఆనవాయితీగా వస్తుంది. రోజుకి 24 గంటలు చొప్పున విభజిస్తూ సమయాన్ని లెక్క వేస్తున్నాం. కానీ ఇప్పుడు అదే లెక్క మారబోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మారుతున్న లెక్క..
సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగాన్ని బట్టి సమయాన్ని లెక్కిస్తాం. కానీ ఇప్పుడు భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా మందగిస్తోందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ కొనసాగుతూ పోతే, భవిష్యత్తులో ఒక రోజు 25 గంటలు అయ్యే అవకాశం ఉందని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో స్పష్టం చేశారు.

మార్పునకు కారణం ..?
ఈ మార్పునకు ప్రధాన కారణం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు. ప్రతి సంవత్సరం చంద్రుడు సుమారు 3.8 సెంటీమీటర్ల దూరం భూమి నుంచి వెనక్కి పోతూ ఉంటుంది. ఈ క్రమంలో భూమి-చంద్రుల మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు జరుగుతున్నాయి. ఈ పరిణామం వల్ల భూమిపై ఉన్న సముద్రాలపై ప్రభావం చూపి, జలచలనం మారుస్తోంది. సముద్రాల్లో ఏర్పడే ఈదల ప్రభావంతో భూమి తిప్పుకునే వేగం క్రమంగా తగ్గుతోందని అంటున్నారు. రింగ్ లేజర్ జైరోస్కోప్ అనే అత్యాధునిక సాంకేతిక పరికరంతో ఈ సూక్ష్మ మార్పులను గుర్తించామని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
గతంలో కూడా..
భూమి చరిత్రలో ఇలాంటి మార్పులు గతంలో ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయని అంటున్నారు. సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం, చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండే సమయంలో, భూమి భ్రమణ వేగం ఎక్కువగా ఉండేది. అప్పుడు ఒక రోజు గడవడానికి కేవలం 18 గంటలు పట్టేదని.. ఆ తరువాత చంద్రుడు దూరమవుతున్న కొద్దీ, భూమి వేగం తగ్గుతూ వచ్చిందని.. ఇప్పుడది 24 గంటల దశను చేరుకుందని చెబుతున్నారు.
ఎప్పటి నుంచి అంటే..
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక రోజు 25 గంటలుగా మారడానికి సుమారు 20 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చని వివరిస్తున్నారు. ఒకవేళ అప్పుడు ఇదే జరిగితే భావితరాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 25 గంటలకు అనుగుణంగా క్యాలెండర్లు, అటామిక్ క్లాక్స్, GPS వంటి ఖచ్చిత సమయ వ్యవస్థలు తిరిగి రూపొందించాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. విమానయాన, అంతరిక్ష ప్రయాణాల సమయపాలన, టెలికమ్యూనికేషన్, అంతర్జాతీయ సమయమానం (UTC) లాంటి వ్యవస్థల్లోనూ మార్పులు జరుగుతాయని సూచిస్తున్నారు.
అంతే కాకుండా విద్యార్థులకు, ఉద్యోగులకు, ఫ్యాక్టరీల పనివేళలకు సంబంధించి రోజు షెడ్యూళ్లు మారే అవకాశం ఉంటుందని తెలిపారు. నిద్ర, జీవక్రియలు, జీవవైవిధ్యం వంటి అంశాలపైనా దీర్ఘకాలికంగా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications