ఒక్క ఎలుక కోసం 10 ఏళ్ల సుదీర్ఘ వేట! ఊపిరి పీల్చుకున్న ద్వీపం
కెరీబియన్ దీవుల్లోని పూఎర్టో రికో తీరానికి సమీపంలో ఉండే దేసెచియో ద్వీపం ఒకప్పుడు అరుదైన పక్షులు, చెట్లకు స్వర్గధామం. వేలాది సముద్ర పక్షులు గూళ్లు కట్టుకుని సందడి చేసే ఈ ద్వీపం, కాలక్రమేణా మనుషుల కార్యకలాపాలు, విదేశీ జంతువుల ప్రవేశంతో నాశనమైపోయింది. ముఖ్యంగా ద్వీపంలోకి ప్రవేశించిన 'నల్ల ఎలుకలు' అక్కడి ప్రాణులకు కాలయముడిగా మారాయి. పక్షుల గుడ్లను, పసి పిల్లలను తినేయడమే కాకుండా, స్థానిక మొక్కల విత్తనాలను నాశనం చేస్తూ ద్వీప పర్యావరణాన్ని నిలువునా దహించివేశాయి.
ఒకప్పుడు ఈ ద్వీపంలో పదుల వేల సంఖ్యలో బ్రౌన్ బొబీస్, రెడ్ ఫుటెడ్ బొబీస్ వంటి పక్షులు నివసించేవి. కానీ ఎలుకలతో పాటు గొర్రెలు, కోతులు, పెంపుడు పిల్లుల దాడికి తాళలేక 2000 నాటికి ఏడు ప్రధాన పక్షి జాతులలో ఐదు జాతులు ద్వీపం నుంచి శాశ్వతంగా మాయమయ్యాయి. మిగిలిన పక్షుల సంఖ్య కూడా 2 శాతానికి పడిపోయింది. పక్షులే కాకుండా ద్వీపంలో మాత్రమే లభించే అరుదైన 'హిగో చుంబో' కాక్టస్ బ్రహ్మజెముడు జాతి మొక్కల విత్తనాలను ఎలుకలు తినేయడంతో ఆ మొక్కల పునరుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

తొలి ప్రయత్నం ఫెయిల్.. అయినా వదలని పట్టుదల
ఈ విపత్తు నుంచి ద్వీపాన్ని కాపాడేందుకు 'యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్' పర్యావరణ వేత్తలు రంగంలోకి దిగారు. మొదట మేకలు, కోతులను ద్వీపం నుంచి తొలగించినా, అసలైన విలన్లయిన ఎలుకలను ఏరివేయడం పెద్ద సవాలుగా మారింది. 2007లో ప్లాన్ చేసి, 2012లో చేపట్టిన తొలి ఆపరేషన్ దారుణంగా విఫలమైంది. కొండలతో కూడిన అటవీ ప్రాంతంలో ఎలుకలన్నింటినీ మట్టుబెట్టడం సాధ్యం కాలేదు. అయితే నిరాశ చెందని పర్యావరణ వేత్తలు, 2016లో మరిన్ని ఆధునిక పద్ధతులతో రెండోసారి భారీ 'ఎలుకల నిర్మూలన ఆపరేషన్' చేపట్టారు.
2017: ఎలుకలు లేని ద్వీపంగా ప్రకటన!
రెండో ప్రయత్నం తర్వాత ద్వీపంలో ఒక్క ఎలుక కూడా మిగలకుండా చేసేందుకు అధికారులు 2017లో భారీ తనిఖీలు చేపట్టారు. ట్రాకింగ్ కెమెరాలు, మోషన్ సెన్సార్లు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి పది రోజుల పాటు వేలాది చిత్రాలను విశ్లేషించారు. చివరికి దేసెచియో ద్వీపంలో ఒక్క ఎలుక కూడా లేదని 2017లో అధికారికంగా ప్రకటించారు. దశాబ్ద కాలం పాటు సాగిన సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కింది.
మళ్లీ వికసిస్తున్న జీవ వైవిధ్యం!
ఎలుకల ముప్పు తొలగిపోవడంతో దేసెచియో ద్వీపం మళ్లీ సరికొత్త శోభను సంతరించుకుంటోంది. అంతరించే దశకు చేరిన 'హిగో చుంబో' కాక్టస్ మొక్కలు మళ్లీ వికసిస్తూ పండ్లను ఇస్తున్నాయి. స్థానిక బల్లులు, తొండలు, పీతల సంఖ్య విపరీతంగా పెరిగింది. అరుదైన సముద్ర పక్షులు మళ్లీ ద్వీపానికి వచ్చి గూళ్లు కట్టుకోవడం ప్రారంభించాయి. ఒకప్పుడు ఎలుకల విధ్వంసంతో విలవిలలాడిన ఒక ద్వీపం, పట్టుదలతో కూడిన పర్యావరణ పరిరక్షణ వల్ల మళ్లీ ఎలా ప్రాణం పోసుకుందో చెప్పడానికి ఈ దేసెచియో ద్వీపమే ప్రత్యక్ష నిదర్శనం.














Click it and Unblock the Notifications