National Space Day: చంద్రయాన్ 3 సక్సెస్ అయిందక్కడే
ISRO: జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని దేశం ఘనంగా జరుపుకొంటోంది. ఇది తొలి నేషనల్ స్పేస్ డే. సరిగ్గా ఏడాది కిందట భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడిపై అడుగు పెట్టింది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చందమామ దక్షిణ ధృవంపై అడుగు మోపింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సం ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలంటూ అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి అనుగుణంగా నేడు పలు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో అంతరిక్ష సంబంధిత కార్యక్రమాలను చేపట్టారు.

ఇస్రో సైతం భారతీయ అంతరిక్ష హాకథాన్, రొబొటిక్స్ ఛాలెంజ్ అంశంపై జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించింది. ఇందులో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుమతులను ప్రదానం చేశారు. దేశ రాజధానిలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర ప్రసాద, ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్, పలువురు శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోమ్‌నాథ్ మాట్లాడారు. గత సంవత్సరం ఇదే రోజున చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించగలిగామని, ఈ మూన్ మిషన్ ఇచ్చిన స్ఫూర్తి కొన్ని తరాల వరకు చిరస్థాయిగా నిలిచివుంటుందని అన్నారు. దేశ ప్రజల సంపూర్ణ సహకారంతో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని పేర్కొన్నారు. అన్నిరకాలుగా కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించిందని, అక్కడే సక్సెస్ అయ్యామని చెప్పారు

ఆదిత్య ఎల్ 1, గగన్ యాన్.. వంటి అనేక ప్రాజెక్టులను విజయవంతంగా మలచడానికి చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావడం తమకు ఎంతో ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు. మున్ముందు అనేక కీలక ప్రాజెక్టులను తాము విజయవంతం చేయగలమనే ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు.
ప్రదానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తమ స్పేస్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించడం, తమను ప్రశంసించడం ఓ గొప్ప అనుభూతిని మిగిల్చిందని ఎస్ సోమ్‌నాథ్ అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుకొందామంటూ అప్పుడే ఆయన ప్రకటించారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications