సంజు శాంసన్ ఫ్లాప్ షో- తడాఖా చూపిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
టీ20 ఇంటర్నేషనల్స్ లో టీమిండియా బోణీ కొట్టింది. ఆదివారం రాత్రి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మొదటి టీ20లో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత జట్టు ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ ను చిత్తు చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో ఆల్ రౌండ్ ప్రతిభను కనపర్చింది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 1-0 తేడాతో ముందంజ వేసింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడినప్పటికీ.. మిడిలార్డర్ ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగిందా టీమ్. మొదటి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్ డకౌట్ అయ్యాడు. కేప్టెన్ ఇబ్రహీం జడ్రాన్- 11, సెదికుల్లా అటల్- 13, గుల్బదిన్ నబీ- 2, డార్విష్ రసూలి- 2.. ఇలా టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలింది.. టీమిండియా బౌలర్ల ధాటికి. ఒకదశలో 43 పరుగులకే 5 వికెట్లు నేలకూలాయి.

ఆ దశలో మిడిలార్డర్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆదుకున్నాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతనికి మహ్మద్ నబీ నుంచి చక్కటి సహకారం అందింది. 27 బంతుల్లో రెండేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లు బాదిన నబీ 33 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ దెబ్బకు 156 పరుగుల గౌరవప్రద స్కోర్ చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్. అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు కూల్చగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఈ స్కోర్ ను భారత్ 13.4 ఓవర్లలోనే కొట్టి అవతల పడేసింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్ లో రసూలికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 2.1 ఓవర్లలో 18 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ.. బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. మొత్తం 32 బంతుల్లో 7 సిక్సర్లు, 7 ఫోర్లతో 82 పరుగులు చేశాడు.
వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా సమయోచితంగా ఆడాడు. అభిషేక్ శర్మకు చక్కని సహకారం అందిస్తూ 33 బంతుల్లో 42 పరుగులు చేశాడు. వీరిద్దరి దూకుడుతో భారత్ అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. జింబాబ్వేపై 49 బంతుల్లో 81 పరుగులు చేసి అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి తప్పించింది జట్టు మేనేజ్మెంట్. అతని స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు తీసుకుంది. శాంసన్ నిరాశపరిచాడు.
అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్.. ఈ మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చి వేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడీ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్. అభిషేక్ సాగించిన సిక్సర్ల వర్షం మ్యాచ్‌కే హైలైట్. ఇక రెండో టీ20 మ్యాచ్.. ఇదే స్టేడియంలో మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది.












Click it and Unblock the Notifications
