టీమిండియాపై డబ్బుల వర్షం.. BCCI నజరానా ఎంతంటే!
భారత అండర్-19 క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2026 అండర్-19 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుని ఆరోసారి ఛాంపియన్‌గా నిలవడంతో దేశవ్యాప్తంగా విజయ సంబరాలు మిన్నంటాయి. ఈ చారిత్రాత్మక ఘనతకు గుర్తింపుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యువ విజేతలకు రూ.7.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.
BCCI ప్రశంసలు..
జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ అయూష్ మాత్రే నాయకత్వంలోని భారత జట్టు అజేయ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను 100 పరుగుల భారీ తేడాతో ఓడించింది. టోర్నమెంట్ మొత్తం మీద అద్భుతంగా ఆడిన భారత్, ఫైనల్‌లోనూ అదే ఊపు కొనసాగిస్తూ ట్రోఫీని అందుకుంది. ఈ విజయం అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా జట్టు ప్రదర్శనను కొనియాడుతూ, ఈ యువ ఆటగాళ్లు భారత క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాదులని ప్రశంసించారు.

ఫైనల్‌లో భారత్ బ్యాటింగ్ ప్రదర్శన అసాధారణంగా నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఈ భారీ లక్ష్యం ఇంగ్లండ్‌పై అపార ఒత్తిడిని మోపింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.
వైభవ్ వీరోచితంగా..
వైభవ్ సూర్యవంశీ వీరోచితంగా 175 పరుగులు చేసి ఫైనల్‌కు హైలైట్‌గా నిలిచాడు. కేవలం 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసి అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందే 32 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతడు, తదుపరి 23 బంతుల్లో మరో 50 పరుగులు జోడించి ఇంగ్లండ్ బౌలర్లను పూర్తిగా దెబ్బతీశాడు.
ఆరంభం నుంచే తడబడిన ఇంగ్లాండ్..
412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. కాలేబ్ ఫాల్కనర్ పోరాట శతకం సాధించినప్పటికీ, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. చివరికి ఇంగ్లండ్ 311 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 100 పరుగుల ఘన విజయం సాధించి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.
ప్రధాని హర్షం..
ఈ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. "భారత క్రికెట్ ప్రకాశిస్తోంది. అండర్-19 వరల్డ్‌కప్ గెలవడం గర్వకారణం. మన యువ జట్టు అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించింది, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఈ యువ ఛాంపియన్లకు నా అభినందనలు," అంటూ ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications