Ind vs Aus:సిరాజ్ - హెడ్ మధ్య వాగ్వాదం - క్లారిటీ ఇదే..!!
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల ఆటగాళ్లు వాగ్వాదాలకు దిగుతున్నారు.చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇరు జట్ల మధ్య యుద్ధం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. తాజాగా ఆట రెండో రోజున ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ను టీమిండియా పేసర్ మొహ్మద్ సిరాజ్ అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు.అప్పటి దాకా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 140 రన్స్ చేశాడు. ఆ తర్వాత మొహ్మద్ సిరాజ్‌కు చిక్కాడు.దీంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోరు చేసింది.
ట్రావిస్ హెడ్‌ను అద్భుతమైన బంతి వేసి బౌల్డ్ చేశాడు సిరాజ్. ఇదే ఊపుమీద ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సంజ్ఞ చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక పెవీలియన్‌కు వెళుతూ ఏదో అన్నట్లుగా కెమెరాలో కనిపించింది.దీంతో అటు స్టేడియంలో ఉన్నవారు ఇటు టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌ను చూస్తున్న వారికి ఇద్దరి మధ్య ఏదో వాగ్వాదం జరిగిందనే అభిప్రాయం నెలకొంది.

అయితే మ్యాచ్ తర్వాత ట్రావిస్ హెడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ గురించి చెప్పుకొచ్చాడు. తాను సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి ఔటయ్యాక, సిరాజ్‌ను అభినందించానని అయితే దీన్ని టీమిండియా ఫాస్ట్ బౌలర్ తప్పుగా అర్థం చేసుకున్నాడని వెల్లడించాడు.సిరాజ్‌ను ఏదో అన్నట్లుగా ఆయన అనుకున్నాడని వాస్తవానికి సిరాజ్‌ను అభినందించినట్లు స్పష్టం చేశాడు ట్రావిస్ హెడ్.అయితే సిరాజ్ తనను తప్పుగా అర్థం చేసుకోవడంతో చాలా బాధపడ్డట్టు హెడ్ చెప్పాడు.టీమిండియా ఆటగాళ్లు ఇలానే ప్రవర్తిస్తారంటే ఇక వారిష్టం అంటూ హెడ్ ఒక్కింత అసహనం వ్యక్తం చేశాడు.
" నేను వెల్ బౌల్డ్ సిరాజ్ అని చెప్పాను. సిరాజ్ మాత్రం దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు.పెవీలియన్ వైపు తన వేలు చూపించి వెళ్లు అన్నప్పుడు నేను కూడా రియాక్ట్ అయ్యాను. జరిగిన ఉదంతంపై చాలా బాధపడ్డాను.వాళ్లు ఇలానే ఉంటాం అంటే ఇక వారిష్టం" అని ట్రావిస్ హెడ్ అన్నారు.ఇదిలా ఉంటే సిరాజ్ చేసిన ఆ చర్యపై ఆడిలైడ్ స్టేడియంలో ఆస్ట్రేలియా సపోర్టర్స్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది.
ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ట్రావిస్ హెడ్ మాత్రం టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.141 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఈ సెంచరీని కొన్ని రోజుల క్రితమే పుట్టిన తన కొడుక్కి అంకితం చేశాడు ఈ సన్‌రైజర్స్ ఆటగాడు.బ్యాటింగ్‌కు దిగిన హెడ్..అటు వైపు బుమ్రానా, సిరాజా, హర్షిత్ రానానా, మరొకరా అనే తేడా లేకుండా వచ్చిన బంతిని వచ్చినట్లుగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. ట్రావిస్ బ్యాటింగ్ చూసినవారికి వన్డేలా ఆడాడనే అభిప్రాయం కలిగింది.
"కొన్ని వారాల క్రితమే నాకు బాబు పుట్టాడు.అంతకుముందు మిల్లర్ పుట్టగానే ఇదే తరహాలో సెంచరీ చేశాను." అని గుర్తుచేసుకున్నాడు ట్రావిస్ హెడ్.ఇక చివరిలో కొంత రిస్క్ అయినా సరే చాలా దూకుడుగా ఆడినట్లు చెప్పాడు. ఒకానొక సమయంలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాడు.అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తాను దూకుడుగా ఆడి చేసిన ఈ సెంచరీ తనకు చాలా ప్రత్యేకమైనదని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 29 పరుగుల ఆధిక్యంతో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో రిజల్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications