చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా టీమిండియా మాజీ స్టార్..: జహీర్ ఖాన్ మార్క్ ఎంపిక
టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ ఐపీఎల్ లో తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించబోతోన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన జహీర్ ఖాన్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్‌లో త్వరలో చేరనున్నాడు మోహిత్ శర్మ. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ అధికారికంగా ధృవీకరించారు. జహీర్ ఖాన్ సిఫారసు మేరకు అతన్ని బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఎరిక్ సిమన్స్ స్థానంలో మోహిత్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నాడు. రానున్న రోజుల్లో జహీర్ ఖాన్ పర్యవేక్షణలోనే బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, మెంటార్.. వంటి ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాలు చేపడతామని విశ్వనాథన్ తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మోహిత్ శర్మకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఐపీఎల్ కెరీర్లో రెండు వేర్వేరు దఫాలుగా ఆ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. నాలుగు సీజన్లలో ఆడాడు.

2014 సీజన్ మోహిత్ శర్మ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ సీజన్లో సీఎస్కే తరఫున అతను మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. నాటి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మినిమం గ్యారంటీ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అదే జట్టుకు బౌలింగ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మోహిత్ శర్మ ఐపీఎల్లో మొత్తం 120 మ్యాచ్‌లు ఆడి 134 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టుతో అతని కెరీర్ మరో మలుపు తిరిగింది. గుజరాత్ తరఫున రెండు సీజన్లలో నిలకడగా రాణించాడు. ఈ రెండు సీజన్లలోనే ఏకంగా 41 వికెట్లు నేలకూల్చాడు. డెత్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయడంలో అతనికి అపార అనుభవం ఉంది.
టీమిండియా తరఫున 26 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు మోహిత్ శర్మ. 31 వికెట్లు పడగొట్టాడు. ఎనిమిది టీ20 ఇంటర్నేషనల్స్ లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. 2015 ప్రపంచకప్ ఆడిన ధోనీ సారథ్యంలోని జట్టులో సభ్యుడు కూడా. అప్పట్లో జట్టులో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గత ఏడాది డిసెంబర్లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. హెడ్ కోచ్ జహీర్ ఖాన్ కూడా పేస్ బౌలరే కావడంతో సీఎస్కే బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
