భారత్- వెస్టిండీస్ సిరీస్ డిసైడర్: పరుగుల వరదా? వర్షం బెడదా?
భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగగాల్సి ఉంది. ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తోన్నాయి. 2-2 తో సమంగా నిలవడంతో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వన్డే సిరీస్ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత వెస్టిండీస్ ఊహించని రీతిలో పుంజుకుంది. టీ20 వరల్డ్ ఛాంపియన్ టీమిండియాను కరేబియన్ ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్లోనూ గట్టి పోటీనిచ్చారు. పరుగుల వరద పారిన ఈ నాలుగు మ్యాచ్ లల్లో కూడా విండీస్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తోన్నారు. సెంచరీలతో చెలరేగుతున్నారు. మొదటి మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్లో షై హోప్ విధ్వంసకర శతకంతో వెస్టిండీస్ 252 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది.

ఆ తర్వాత మూడో పోరులో అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం సాధించడంతో భారత్ 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకొని మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20లో కరేబియన్ జట్టు మళ్లీ చెలరేగింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను సమం చేసింది. హోప్ సూపర్ ఫామ్లో ఉంటోన్నాడు. వన్డే, టీ20 ల్లో సెంచరీలు బాదాడు.
చిన్నస్వామి స్టేడియం సాధారణంగానే బ్యాటింగ్కు బాగా అనుకూలించేది కావడం వల్ల ఈ మ్యాచ్ లో కూడా పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు జట్లు కూడా బ్యాటింగ్ లో బలంగా ఉండటం వల్ల క్రీజ్ లో కుదురుకుంటే సిక్సర్ల వర్షం కురుస్తుంది. పవర్హిట్టర్లు ఉండటంతో 200 దాటే అవకాశాలు లేకపోలేదు.
టీమిండియా తుదిజట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ కు చోటు దక్కొచ్చు. గాయం వల్ల ఈ మ్యాచ్ నుంచి అర్ష్దీప్ సింగ్ తప్పుకొన్నాడు. అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్ తుదిజట్టులో ఆడే అవకాశం ఉంది. ఆరంభంలోనే విండీస్ హిట్టర్లను కట్టడి చేయడంపై భారత బౌలర్లు దృష్టి సారించాల్సి ఉంది.
మరోవైపు వెస్టిండీస్ జట్టులో షై హోప్, జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మైర్, రోవ్మన్ పొవెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, రోస్టన్ ఛేజ్, షమార్ స్ప్రింగర్, కేమో పాల్, షమార్ జోసెఫ్, గూడకేష్ మోటీ బరిలోకి దిగే అవకాశం ఉంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా బెంగళూరు నగరంలో సాయంత్రం వేళల్లో కుండపోత వర్షం కురుస్తూ వస్తోంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం ఆటంకం కలిగించేలా కనిపిస్తోంది. ఇప్పటికే మధ్యాహ్నం నుంచి ఆకాశం మబ్బులు కమ్మింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామం ఇరు జట్ల మేనేజ్మెంట్లను కలవరపెడుతోంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడమో లేక ఓవర్లను కుదించడమో జరగొచ్చు.












Click it and Unblock the Notifications
