పిల్లలకు ఇంటర్నెట్ నిషేధం: సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
చిన్నారుల డిజిటల్ భద్రత పేరుతో ఇంటర్నెట్ వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలన్న డిమాండ్లను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశంలోని ప్రతీ పౌరుడికి డిజిటల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ యాక్సెస్ ఓ ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన న్యాయస్థానం.. వయస్సు ఆధారంగా పిల్లలపై ఎలాంటి ఇంటర్నెట్ నిషేధం విధించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది.
రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు
సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక కేసును విచారిస్తూ రాజ్యాంగబద్ధమైన హక్కులను పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు), ఆర్టికల్ 19(1)(ఎ)(వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ) ప్రకారం ఇంటర్నెట్ ను ఉపయోగించడం ప్రతీ ఒక్కరి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దలతో పాటు పిల్లలకు కూడా వారి వయస్సుతో సంబంధం లేకుండా ఈ రాజ్యాంగబద్ధమైన డిజిటల్ హక్కు వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఆన్లైన్ ప్రపంచం నుంచి వారిని పూర్తిగా దూరంగా ఉంచడం వారిని పూర్తిగా దూరంగా ఉంచడం వారి విజ్ఞాన సమపార్జనకు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని వెల్లడించింది.

నిషేధం పరిష్కారం కాదు..
ఆన్లైన్లో పిల్లల భద్రత ఆందోళనకరమే అయినప్పటికీ.. దానికి సంపూర్ణ నిషేధం ఏమాత్రం పరిష్కారం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో, తల్లిదండ్రులు సమన్వయంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తమ వద్ద కఠినమైన పేరెంటింగ్ కంట్రోల్ ఫీచర్లను అందించాలని ఆదేశించింది. పిల్లల లైంగిక వేధింపులు, దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను తక్షణమే గుర్తించి నివేదించడంతో పాటు ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పూర్తిగా తొలగించే ఐటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల ఆన్లైన్ యాక్సెస్, సెర్చ్ హిస్టరీ, కాంటాక్ట్ సెట్టింగ్‌లను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చైల్డ్ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.
డిజిటల్ ప్రపంచంలో రక్షణే ప్రామాణికం!
కేవలం ఆంక్షలు విధించడం ద్వారా పిల్లలను సైబర్ నేరాల నుంచి కాపాడలేమని.. సరైన సాంకేతిక భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా మాత్రమే వారిని సురక్షితంగా ఉంచగలమని సుప్రీంకోర్టు పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూనే పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
