ఆ నగరంలో ఐటీ టవర్స్.. శుభవార్త చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు!
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హన్మకొండపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. హన్మకొండ కేంద్రంగా యువతకు సంతోషం కలిగించే వార్త చెప్పిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఐటీ టవర్స్ ఏర్పాటు చేస్తామని శుభవార్త చెప్పారు.
హనుమకొండలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌కు వేలాది మంది యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్యులు, క్రీడాకారులు తరలివచ్చారు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునివ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన కుమారుడు విశాల్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరిగింది.

హయగ్రీవచారి మైదానం నుంచి 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల దూరాల్లో రన్ నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మారథాన్‌ను ప్రారంభించారు. ఆయనతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. మంత్రి యువతతో కలిసి రన్నింగ్‌లో పాల్గొని ఫిట్నెస్ ప్రాధాన్యాన్ని వివరించారు.
మారథాన్ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు హనుమకొండ ప్రజలకు శుభవార్త అందించారు. త్వరలో హనుమకొండలో ఐటీ టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు. వరంగల్, హనుమకొండ ప్రాంతం హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ ఐటీ రంగాన్ని విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. ఆరోగ్యం మనిషికి గొప్ప సంపద అని, వ్యాయామం, క్రీడలు, ధ్యానం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని యువతకు సలహా ఇచ్చారు.
మారథాన్ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బాలసముద్రం ప్రాంతంలోని స్థానిక టీ స్టాల్ వద్ద ఆగి టీ తాగారు. సాధారణ ప్రజలతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెల్ఫీలు దిగారు. ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీగా ఉండే నేతలు రోడ్డు పక్కన టీ స్టాల్లో కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
వరంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పరిశ్రమల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభ అభివృద్ధి వంటి పథకాలు ముందుకు సాగుతున్నాయి. ఐటీ టవర్స్ ఏర్పాటు ప్రకటన స్థానిక యువతకు సంతోషం కలిగించింది. యువతకు స్థానికంగానే ఉపాధి దొరికే అవకాశం పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హనుమకొండను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
మారథాన్‌లో వికలాంగులు కూడా పాల్గొనడం విశేషం. ఆరోగ్యం, క్రీడలు, సామాజిక స్పృహపై అవగాహన పెంచే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచించారు. ఓరుగల్లు ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఆదరించారు. ఐటీ టవర్స్ ప్రకటనతో ప్రాంతీయ అభివృద్ధికి మరో కీలక అడుగు పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications
