13 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇషాన్ కిషన్ దెబ్బకు ఈస్ట్ జోన్ ఛాంపియన్!
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ పోరులో తొలి ఇన్నింగ్స్ లభించిన భారీ ఆధిక్యం ఆధారంగా ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్న ఈస్ట్ జోన్ ఏకంగా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది. విశేషమేమిటంటే.. 13 ఏళ్ల క్రితం ఇదే స్టేడియంలో ఈస్ట్ జోన్ తమ చివరి దులీప్ ట్రోఫీ గెలుచుకోగా.. ఇది వారి కెరీర్‌లో మూడో టైటిల్ కావడం విశేషం.
కెప్టెన్ ఇషాన్ కిషన్ ఊచకోత
ఈస్ట్ జోన్ చారిత్రత్మక విజయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ హీరోగా నిలిచాడు. రెడ్-బాల్ క్రికెట్లోకి రీ-ఎంట్రీ చేసినప్పటి నుంచి నిలకడగా రాణిస్తున్న ఇషాన్ కిషన్.. ఫైనల్లో తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 334 బంతులను ఎదుర్కొని 522 నిమిషాల పాటు క్రీజులో నిలబడి 270 పరుగులు సాధించాడు. 250 పరుగుల వద్ద కండరాల నొప్పులతో గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లినప్పటికీ.. పట్టు వదలకుండా మళ్లీ మైదానంలోకి వచ్చి స్కోరును 270కి చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 80 పరుగులు సాధించి మొత్తంగా ఈ మ్యాచ్‌లో 350 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అరంగేట్రంలోనే సెంచరీతో మెరిసిన కోనన్ ఖురేషి
ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ లో యువ ఆటగాడు మహమ్మద్ కోనన్ ఖురేషి అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసిన కోనన్ ఖురేషి అజేయంగా 116 పరుగులు చేశాడు. అనుకుల్ రాయ్‌తో కలిసి ఏడో వికెట్ కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి తన రెండు మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఈస్ట్ జోన్ ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేసింది.
పోరాట స్ఫూర్తి చాటిన మహమ్మద్ సిరాజ్
మ్యాచ్ ఫలితం దాదాపుగా తేలిపోయినప్పటికీ సౌత్ జోన్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శించిన పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది. చెన్నైలోని తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణంలో మహమ్మద్ సిరాజ్ సడలని పట్టుదలతో వరుసగా 9 ఓవర్లు బౌలింగ్ చేసి తన వృత్తిధర్మాన్ని చాటుకున్నాడు. అలాగే తన 100వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడుతున్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా బౌలింగ్ లో తన మార్క్ చూపించాడు.
ఫైనల్ మ్యాచ్ ముఖ్యాంశాలు
ఈ మ్యాచ్‌లోని మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 708 పరుగుల కొండంత భారీ స్కోరు సాధించింది. అనంతరం సౌత్ జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే ఆలౌట్ చేసి, ఏకంగా 372 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని పొందింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఈస్ట్ జోన్ 388/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సౌత్ జోన్ ముందు మొత్తం 760 పరుగుల ఆధిక్యం నిలిచింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ విజయం ఖరారు కాగా.. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లతో కలిసి ఇషాన్ కిషన్ వికెట్ స్టంప్స్ తో మైదానంలో డ్యాన్స్ చేస్తూ విజయ సంబరాలు జరుపుకున్నాడు.














Click it and Unblock the Notifications
