లోక్‌సభ ఎన్నికల పోటీపై క్లారిటి ఇచ్చిన మాజీ క్రికెటర్...
టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఈ సారి జరగబోయే ఎన్నికల్లో పోటీచేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా జాతీయ మీడియా కోడై కూస్తుంది. యువరాజ్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే, తాజాగా ఈ వార్తలపై యువరాజ్ సింగ్ స్పందించారు. గత కొన్ని రోజులుగా యువరాజ్ సింగ్ పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తలపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.
తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని యువరాజ్ సింగ్ స్వయంగా ప్రకటించాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో వెలువడుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించాడు. ''గత కొన్నిరోజులుగా మీడియాలో వస్తున్న కథనాలకు నేను వ్యతిరేకం. గురుదాస్‌పూర్ నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా స్థాయికి తగ్గట్టు ప్రజలకు సాయం చేయడమే నా అభిరుచి. 'యూవీ కెన్' ఫౌండేషన్ ద్వారా నేను ఈ సేవలను కొనసాగిస్తాను. మార్పు తీసుకురావడం కోసం మన సామర్థ్యం మేరకు ప్రయత్నిద్దాం'' అంటూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2007టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లను అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్‌లో అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్లలో యువరాజ్ ఒకరు. యువరాజ్ సింగ్ 400లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 17 సెంచరీలు కలుపుకొని 11,708 పరుగులు, 148 వికెట్లు ఉన్నాయి. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అద్భుతాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
అయితే, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారని గత కొన్నిరోజులుగా మీడియాలో ప్రచారం జరిగింది. గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారని కూడా పలు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలనీ యూవీ కొట్టిపడేసాడు. తాను ఎన్నికల్లో అసలు పోటీ చేయడం లేదని మాజీ క్రికెటర్ ఖరాఖండీగా చెప్పేసాడు.












Click it and Unblock the Notifications