ఒకరిద్దరికే క్రెడిట్ ఇవ్వడం ఏంటి?: గంభీర్ అసలు ప్లాన్ ఇదా?
IND vs WI: కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో భారత్ టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సంజూ శాంసన్ (97 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన వేళ.. మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఏళ్ల నాటి నొప్పి.. గంభీర్ సెన్సేషనల్ కామెంట్స్
విజయం అనంతరం జరిగిన మీడియాతో గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో పాత జ్ఞాపకాలను, అసంతృప్తిని బయటపెట్టారు. ముఖ్యంగా జట్టులో కొందరికి మాత్రమే క్రెడిట్ ఇచ్చే సంస్కృతిపై ఆయన మండిపడ్డారు. "ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ, శివమ్ దూబే అందించిన చిన్న సహకారాన్ని కూడా మీరు గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది. గత కొన్నేళ్లుగా మనం కేవలం ఒకరిద్దరి ప్రదర్శనల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నా దృష్టిలో సంజు శాంసన్ చేసిన 97 పరుగులు ఎంత ముఖ్యమో.. శివమ్ దూబే కొట్టిన ఆ రెండు ఫోర్లు కూడా అంతే ముఖ్యం." అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. 2007, 2011 ప్రపంచకప్ ఫైనల్స్‌లో గంభీర్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. ఎక్కువ క్రెడిట్ అప్పటి కెప్టెన్‌కే దక్కిందనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. గంభీర్ తాజా వ్యాఖ్యలు ఆ పాత గాయాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఉన్నాయి.

'డ్రాప్' కాదు.. 'సేవ్' చేశాం!
టోర్నీ ప్రారంభంలో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై వస్తున్న విమర్శలకు గంభీర్ స్పష్టతనిచ్చారు. "సంజూని మేము జట్టు నుంచి తొలగించలేదు, సరైన సమయం కోసం అతన్ని జాగ్రత్తగా భద్రపరిచాం. ప్రతి ఆటగాడికి గడ్డు కాలం ఉంటుంది, ఆ సమయంలో ఒత్తిడి నుంచి వారిని కాపాడటం కోచ్‌గా నా బాధ్యత. అతను ప్రపంచకప్‌లో ఖచ్చితంగా రాణిస్తాడని మాకు ముందే తెలుసు." అని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు.
స్టాటిస్టిక్స్ కంటే నమ్మకమే ముఖ్యం
గణాంకాల కంటే మైదానంలో ఆటగాడి ఆత్మవిశ్వాసమే తనకు ముఖ్యమని గంభీర్ తేల్చి చెప్పారు. "నేను నంబర్లను నమ్మను. టీ20 అనేది నమ్మకం, సమయస్ఫూర్తితో ఆడే ఆట. నా అనుభవాన్ని కెప్టెన్‌తో పంచుకుంటాను, కానీ తుది నిర్ణయం ఎప్పుడూ కెప్టెన్‌దే," అని జట్టు యాజమాన్యం పనితీరును వివరించారు.
సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో ఢీ!
వెస్టిండీస్‌పై సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ ఇప్పుడు టైటిల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. మార్చి 5న ముంబై వేదికగా జరిగే సెమీఫైనల్‌లో టీమిండియా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. గంభీర్ మార్గదర్శకత్వంలో భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications