వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ పై తేల్చి చెప్పిన గౌతమ్ గంభీర్.. !!
ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అదరగొట్టింది.. టీమిండియా. దీన్ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మూడింట్లోనూ తుక్కు రేగ్గొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆల్ రౌండ్ ప్రతిభను కనపరిచింది. ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. ఈ మూడు మ్యాచ్ లన్నీ ఏకపక్షం అయ్యాయి. గెలుపు మాట అటుంచితే.. కనీసం ఆ అవకాశాలను కూడా ఇవ్వలేదు టీమిండియా.
బ్యాటర్లు, బౌలర్లు.. గాడినపడ్డారు. వారికి ప్రాక్టీస్ లా పనికొచ్చినట్టయిందీ సిరీస్. ప్రత్యేకించి ఓపెనర్లు సునామీని సృష్టించారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు.. తమ రికార్డులను తిరగరాసుకోవడానికి ఉపయోగపడ్డాయి ఈ మ్యాచ్ లు. చివరి మ్యాచ్ లో అభిషేక్ శర్మ మరింత రెచ్చిపోయాడు. 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతని మ్యాడ్ ఇన్నింగ్.. ఎనిమిదికి పైగా పాత రికార్డులను చెరిపేసింది.

ఓపెనర్లు దూకుడుగా ఆడటం.. ఒక రకంగా వైభవ్ సూర్యవంశీకి చెక్ పెట్టినట్టయింది. జట్టులో పూర్తిస్థాయి సభ్యుడిగా చోటు దక్కించుకోవడాన్ని మరింత దూరం చేసినట్టయింది. మరికొంత కాలం పాటు ఎదురు చూడక తప్పదనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. ఈ సిరీస్ కోసం ఎంపికైనప్పటికీ.. తుదిజట్టులో చోటు దక్కలేదు వైభవ్ సూర్యవంశీకి. ఒక్క మ్యాచ్ కూడా అతను ఆడలేకపోయాడు.
నిజానికి.. దీనికంటే ముందు జరిగిన జింబాబ్వే పర్యటనలో అద్భుతమైన ఫామ్‌ను కనబర్చాడీ లెఫ్ట్ హ్యాండర్. 196.10 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 151 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు పూర్తిస్థాయి ఓపెనర్ గా ఆడతాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి కూడా. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా మారాయి. ఈ సిరీస్ కు సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి రావడంతో వైభవ్ డగౌట్ కే పరిమితం కావాల్సి వచ్చింది.
దీనిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వైభవ్ తన అవకాశాల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని స్పష్టం చేశాడు. ఈ సిరీస్ తో సంజూ శాంసన్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా వైభవ్ కోసం శాంసన్‌ను పక్కన పెట్టాల్సి రావడం తన కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని చెప్పాడు. ప్రపంచ కప్ సాధించిన జట్టును తిరిగి కొనసాగించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశాడు.
వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై జట్టులో ఎలాంటి సందేహాలు లేవని గంభీర్ వ్యాఖ్యానించాడు. సీనియారిటీ, ట్రాక్ రికార్డ్ ఉన్న ఆటగాళ్లకు జట్టు ప్రాధాన్యత క్రమంలో ముందంజలో ఉంటారని వివరించాడు. ఈ క్రమంలోనే ఎవరైనా సరే.. తమ సమయం వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదని అన్నాడు. అవకాశం లభించినప్పుడు నిలకడగా ఆడటానికి వైభవ్ మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని గంభీర్ పేర్కొన్నాడు. 15 ఏళ్ల కుర్రాడైనా లేదా 30 ఏళ్ల సీనియర్ అయినా సరే, అవకాశాల కోసం ఓపిక పట్టడం క్రికెట్‌లో సహజమని చెప్పాడు.














Click it and Unblock the Notifications
