ఇంత చెత్త టీమ్ చూడలేదు- భారత్ తో మ్యాచ్ వేళ పాకిస్తాన్ పై భజ్జీ షాకింగ్..!
భారత్-పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీపై హై ఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ జరిగే మ్యాచ్ లో ఇరుజట్లూ హోరాహోరీ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ టీమ్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి పాకిస్తాన్ జట్టును గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదంటూ భజ్జీ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
పాకిస్తాన్ జట్టు తాజా పరిస్ధితిపై హర్భజన్ సింగ్ తాజాగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇందులో ఇంత దారుణమైన పాకిస్తాన్ జట్టును గతంలో ఎప్పుడూ చూడలేదన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ పతనావస్ధపై భజ్జీ స్పందిస్తూ.. జట్టులో ఐకమత్యం లేదని, మ్యాచ్ విన్నర్లు లేరని స్పష్టం చేశాడు. 2011-12కు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితి లేదన్నాడు. భజ్జీ వాదనతో ఒకప్పటి పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ ఏకీభవించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన ఓ చర్చలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు మొహమ్మద్ యూసుఫ్, షాహిద్ అప్రిదీలతో కలిసి పాకిస్తాన్ టీవీలో జరిగిన ఓ చర్చలో హర్బజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టులో ఐకమత్యం లేకపోవడం తనకు అసంతృప్తి కలిగిస్తోందని హర్భజన్ తెలిపాడు. గతంలో తాము పాకిస్తాన్ తో ఎప్పుడు ఆడినా ప్రత్యర్ది తమను ఓడించగలదన్న అభిప్రాయం ఉండేదని, అప్పటి జట్లలో ఉన్న స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లే ఇందుకు కారణమన్నాడు. అప్పట్లో జట్టులో 7-8 మంది మ్యాచ్ విన్నర్లు ఉండేవారని, వారు తమదైన రోజున జట్టును గెలిపించగల పరిస్ధితి ఉండేదన్నాడు. కానీ 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నుంచి భారత్-పాక్ ఇద్దరూ ఆరు మ్యాచ్ లు ఆడితే ఇందులో ఐదు భారత్ గెలిస్తే మరో మ్యాచ్ ఫలితం తేలలేదని గుర్తుచేశాడు.












Click it and Unblock the Notifications