Asia Cup 2025 Final:పోండ్రా బై..పోయి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుకోండ్రి..!!
Asia Cup 2025 Final:ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ మొత్తానికి ముగిసింది. అయితే టోర్నీ ప్రారంభం నుంచి చివరి దాకా ప్రపంచం యావత్తు భారత్ పాక్ ఆడే మ్యాచ్‌లపైనే దృష్టి సారించింది. వివాదాలు, విమర్శలు, ఈగోలు ఇవన్నీ భారత్ పాక్ మ్యాచ్‌లో కనిపించాయి. అయితే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు భారత్ వ్యవహరించిన తీరుపై భారతీయులంతా మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పాకిస్తాన్ జట్టుకు మాత్రం తమ దేశ ప్రజల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. సల్మాన్ నాయకత్వంలో పాక్ జట్టును పాకిస్తాన్ ప్రజలే భీకరంగా ట్రోల్ చేస్తుండటం విశేషం. తాజాగా మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లు సైతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తలంటారు.
పాక్ జట్టుపై వసీం అక్రం ఫైర్..
ఆసియా క్రికెట్ కప్ ఫైనల్ సందర్భంగా చాలా ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు వివాదాలు కొనసాగుతూనే మరో వైపు పాక్ క్రికెట్ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. అయితే సొంత దేశం నుంచి ఈ విమర్శలు రావడం పాక్ క్రికెట్ జట్టు చెత్త ప్రదర్శనకు అద్దం పడుతోంది. ఆదివారం మ్యాచ్ ముగియగానే పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రం రవిశాస్త్రితో కలిసి ఓవరాల్ ఫైనల్ పై విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా వసీం అక్రం పాక్ జట్టును కబడ్డీ ఆడుకున్నాడు. గెలిచే మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేయడంపై వసీం అక్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ జట్టు కూర్పు సరిగ్గా లేదని అన్నారు. టీమిండియా లాంటి బలోపేతమైన జట్టుపై పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరు సాధించినప్పటికీ... బౌలింగ్ సందర్భంగా పవర్ ప్లేలో మూడు వికెట్లు తీసి మ్యాచ్ తమవైపు తిప్పుకుందని వసీం అక్రం అన్నారు. ఇక ఆ తర్వాత తిలక్ వర్మ - సంజు శాంసన్, తిలక్ వర్మ - శివం దూబేలు నిర్మించిన పార్టనర్షిప్‌పై వసీం అక్రం ప్రశంసలు కురింపించారు.

రవూఫ్ పై తీవ్ర విమర్శలు
పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ అని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. తను తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పాక్ భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పుకొచ్చాడు. ఇది ఒక కారణమైతే మరొక కారణం హారిస్ రవూఫ్. అవును హారిస్ రవూఫ్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో వివాదాస్పద క్రికెటర్‌గా ముద్ర వేసుకున్నాడు. ఇతనిపై వసీం అక్రం తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు. "పాకిస్తానీగా ఉన్న నేనే హారిస్ రవూఫ్ ఆటతీరుపై విమర్శలు గుప్పిస్తున్నానంటే... ఇతని ఆటతీరు ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోంది" అని వసీం అక్రమ్ అన్నారు. రవూఫ్ ముందుగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని సూచించారు. రెడ్ బాల్ ఆడే అనుభవం ఉన్నవారినే జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 3.5 ఓవర్లు వేసిన రవూఫ్ 50 పరుగులు సమర్పించుకుని బౌలర్‌లలో రన్ మెషీన్‌గా నిలిచాడని వసీం ఎద్దేవ చేశారు.ఒక్క వికెట్ కూడా తీయకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. అతనికి టీమిండియా అంటే జ్వరం పట్టుకుంటోందని సెటైర్ వేశాడు.
రెడ్ బాల్ క్రికెట్ ఆడాలి..
ఇక రెడ్ బాల్ క్రికెట్ ఆడటం లేదు సరికదా.. రవూఫ్ కనీసం తన ఆటతీరును మెరుగుపర్చుకునే ప్రయత్నం కూడా చేయట్లేదని వసీం అక్రమ్ ఫైర్ అయ్యాడు. హారిస్ రవూఫ్ వెంటనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడి అక్కడ సత్తాను చాటుకోవాలని సూచించాడు. ఒక్క రవూఫ్ మాత్రమే కాదు.. ప్రస్తుత పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్లలో చాలామంది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు తిరిగి వెళ్లి చక్కటి ప్రదర్శన కనబర్చి ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయ జట్టులోకి రావాలని అక్రం సలహా ఇచ్చాడు. వసీం అక్రం మాటలతో మరో పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా ఏకీభవించాడు. రెడ్ బాల్ ఆడని క్రికెటర్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రమోట్ చేయకూడదని వారిని వెంటనే జట్టులో నుంచి తొలగించాలని బోర్డుకు అక్రం సూచించారు. పాకిస్తాన్ జట్టు ఎక్స్‌ట్రాలు తగ్గించుకుని ఒల్లు దగ్గర పెట్టుకుని ఆడితే బాగుంటుందని పలువురు పాకిస్తాన్‌కు చెందిన క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టింగులు పెడుతున్నారు. రవూఫ్ వేసిన 15వ ఓవర్, 20వ ఓవర్‌లో పరుగులు సమర్పించుకోవడంతోనే మ్యాచ్‌ను భారత్‌కు బంగారం పళ్లెంలో పెట్టి ఇచ్చాడని అక్రం, వకార్‌లు అభిప్రాయపడ్డారు.2022 టీ20 వరల్డ్ కప్‌లో కూడా రవూఫ్ వేసిన 19వ ఓవర్లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 15 పరుగులు పిండి టీమిండియాకు విజయాన్ని చేకూర్చానే విషయాన్ని నెటిజెన్లు గుర్తుచేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications