హైదరాబాద్‌పై పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ ఏం చెప్పాడంటే..!!
హైదరాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయఢంకా మోగించింది. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరు బ్లాక్ క్యాప్స్ కొట్టి అవతల పడేశారు. 36.2 ఓవర్లలోనే భారీ టార్గెట్‌ను ఛేదించారు. ఓపెనర్ డెవాన్ కాన్వే- 152, టాప్ ఆర్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర- 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయ కేతనాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 286 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్, సవూద్ షకీల్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. 68 చొప్పున పరుగులు సాధించారు. మహ్మద్ నవాజ్- 39, షాదబ్ ఖాన్ 32 పరుగులతో రాణించారు.

మిగిలిన బ్యాటర్లెవరూ ఈ స్థాయిలో సత్తా చాటలేకపోయారు. కేప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి ఘోరంగా విఫలం అయ్యాడు. అయిదు పరుగులకే పెవిలియన్ చేరాడు. నెదర్లాండ్స్ జట్టులో బాస్ డె లీడె నాలుగు వికెట్లు పడగొట్టాడు. 9 ఓవర్లల్లో 62 పరుగులు ఇచ్చిన లీడె.. మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తిక్ అహ్మద్, షాదబ్ ఖాన్, హసన్ అలీని వెనక్కి పంపించాడు. కొలిన్ అక్కెర్‌మన్-2 వికెట్లు కూల్చాడు. ఆర్యన్ దత్, లొగాన్ వాన్ బీక్, పాల్ వాన్ మీకెరెన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు తడబడింది. 41 ఓవర్లల్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్, టాప్ ఆర్డర్ బ్యాటర్ కొలిన్ అకెర్‌మన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. విక్రమ్ జీత్ సింగ్- 52, బాస్ డి లీడె- 57 పరుగులు చేశారు. బస్ డీ లీడె-67, సకిబ్ జుల్ఫికర్- 10, స్కాట్ ఎడ్వర్డ్స్- 0, వాండెర్వ్ మెర్వ్- 4, లొగాన్ వాన్ బీక్- 28 పరుగులు చేశారు.
పాకిస్తాన్ బౌలర్లల్లో హ్యారిస్ రవూఫ్ అదరగొట్టాడు. మూడు వికెట్లతో సత్తా చాటాడు. హసన్ అలీ-2 వికెట్లు కూల్చాడు. షహీన్ షా అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదబ్ ఖాన్ ఒక్కో వికెట్‌తో సరిపెట్టుకున్నారు. ఇక పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 10వ తేదీన ఆడనుంది. శ్రీలంకతో తలపడుతుంది.
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ మాట్లాడాడు. ఈ విజయంపై సంతృప్తిని వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లల్లో జట్టు సత్తా చాటిందని వ్యాఖ్యానించాడు. మున్ముందు కీలకమైన మ్యాచ్‌లను ఆడాల్సిన దశలో జట్టు అన్ని రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందని చెప్పాడు.
ప్రత్యేకించి హైదరాబాద్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు బాబర్ ఆజమ్. ఇక్కడి ప్రేక్షకులు తమకు మద్దతునిచ్చిన విధానం ఉత్తేజితులను చేసిందని చెప్పాడు. హైదరాబాదీయుల ఆతిథ్యాన్ని ఆస్వాదించామని పేర్కొన్నాడు. మ్యాచ్ గెలవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారని, ఇక్కడి పిచ్ బౌలింగ్‌కు సహకరించిందని అన్నాడు.
ఇన్నింగ్ ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం కొంత ఆందోళనకు గురి చేసినప్పటికీ- మహ్మద్ రిజ్వాన్, సవూద్ షకీల్ భారీ ఇన్నింగ్‌తో జట్టును ఆదుకున్నారని, ఇలాంటి భాగస్వామ్యాన్ని తాము ఆశించామని అన్నాడు. సవూద్ తన ఇన్నింగ్స్‌ను నిర్మించిన విధానం ఆకట్టుకుందని చెప్పాడు.












Click it and Unblock the Notifications