ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌కు డబ్బే డబ్బు- దెబ్బకు లైఫ్ సెటిల్: ఐపీఎల్ కూడా బలాదూర్
Champions Trophy 2025 Prize Money: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
గ్రూప్స్ ఇవే..
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

15- ప్లేయర్స్ టీమ్‌లో..
గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
భారీ మార్పులు చేర్పులు..
ఇప్పుడీ జట్టులో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జట్టు స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వైదొలిగాడు. వెన్ను నొప్పి కారణంగా ఈ ప్రిస్టేజియస్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సొచ్చిందతనికి. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వంద శాతం ఫిట్‌నెస్‌తో లేడని పేర్కొంది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు లభించిందీ 15 మంది సభ్యులు గల టీమిండియా స్క్వాడ్‌లో.
జైస్వాల్ కూడా..
డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకొన్నాడు. రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే జట్టులో ఉంటాడు. ఇప్పటికే మహ్మద్ సిరాజ్, శివందుబే నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వారితో జత కట్టాడు యశస్వి జైస్వాల్. గాయం గానీ, అనారోగ్యానికి గానీ గురికాకపోయినప్పటికీ- దుబాయ్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని బౌలర్‌ను తీసుకోవడమే దీనికి కారణం.
ప్రైజ్ మనీ ఇదే..
తాజాగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌కు అందించే ప్రైజ్ మనీ వివరాలను వెల్లడించింది ఐసీసీ. విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్టులు, గ్రూప్ మ్యాచ్ విజేతలు, 5, 6, 7, 8 స్థానాల్లో నిలిచిన జట్లకు ఇవ్వదలించిన ప్రైజ్ మనీ వివరాలతో కూడిన పూర్తి జాబితాను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. 5, 6 స్థానాలు, 7,8 స్థానాల్లో నిలిచిన జట్లకు వేర్వేరుగా ప్రైజ్ మనీ ఉంటుంది.
విజేతకు 2.24 మిలియన్ డాలర్లు..
విజేతకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్‌గా నిలిచిన టీమ్ 1.12 మిలియన్ డాలర్లు బహుమతి అందుకుంటుంది. సెమీ ఫైనలిస్టులు- 560,000, గ్రూప్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు- 34,000, పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో నిలిచిన జట్టు- 350,000, 7, 8 స్థానాల్లో నిలిచిన జట్టు- 140,000 డాలర్ల నగదు బహుమతిని అందజేస్తుంది ఐసీసీ. పార్టిసిపేషన్ ఫీగా ఒక్కో జట్టుకు 125,000 చెల్లిస్తుంది.












Click it and Unblock the Notifications