భారత్ తో ఆడకపోతే పోతార్రోయ్.. కట్టకట్టుకు పోతారు
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 15వ తేదీన భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన వెంటనే ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. పలు అంశాలను ఇందులో ప్రస్తావించింది. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.
భారత్ తో మ్యాచ్ ఆడకూడదని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం.. ప్రపంచ క్రికెట్‌కు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఐసీసీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టుకు శ్రీలంకకు వెళ్లడానికి అనుమతించినా, భారత్‌తో ఆడవద్దని ఆదేశించడం సరికాదని పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనను ఐసీసీ అధికారికంగా గుర్తించినప్పటికీ, ఓ అంతర్జాతీయ టోర్నమెంట్ స్ఫూర్తికి ఇది విరుద్ధమని తెలిపింది.

ఇప్పటివరకూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుండి అధికారిక సమాచారం ఇంకా అందలేదని, దీనికోసం వేచి చూస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. టీ20 వరల్డ్ కప్‌లో తమ జాతీయ జట్టు.. ఎంపిక చేసిన మ్యాచ్‌లలో మాత్రమే పాల్గొనాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించినే విషయం తమ దృష్టికి వచ్చిందని ఐసీసీ వివరించింది. షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ను దాటవేయడం అనేది మంచి సంప్రదాయం కాదని, ఓ ప్రపంచ స్థాయి ఈవెంట్ ప్రాథమిక సూత్రాలకు భిన్నమని పేర్కొంది.
అన్ని అర్హతలు సాధించిన జట్లు ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం సమాన నిబంధనలపై పోటీ పడతాయని ఆశించే గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్ లో ఇలా ఎంపిక చేసిన టీమ్ ను బహిష్కరించాలనుకోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, వీటిని సమన్వయం చేయడం కష్టతరమని ఐసీసీ తేల్చి చెప్పింది. తమ టోర్నమెంట్లన్నీ కూడా నిష్పక్షపాత, సమగ్రత, పోటీతత్వంపై ఆధారపడి ఉంటాయని, ఇటువంటి నిర్ణయం క్రీడా పవిత్రతను దెబ్బతీస్తుందని పేర్కొంది.
క్రీడారంగంలో ప్రభుత్వాల పాత్రను గౌరవిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయం అటు ఆ రంగానికి, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు హానికరమని అని ఐసీసీ తెలిపింది. ఈ చర్యల వల్ల క్రికెట్ పర్యావరణ వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుందని హెచ్చరించింది. పాకిస్తాన్‌లోని క్రికెట్‌కు గణనీయమైన, దీర్ఘకాలిక పరిణామాలను పీసీబీ పరిగణలోకి తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తోన్నట్లు తెలిపింది. దీనికి పరిష్కారం కనుగొనడానికి పీసీబీతో సహా అన్ని సభ్య దేశాలు సహాయపడాలని సూచించింది.












Click it and Unblock the Notifications