ICC World Cup Final:వరల్డ్ కప్ ఫైనల్లో ఆడే జట్లు ఇవే ? ఆస్ట్రేలియా వెటరన్ షేన్ వాట్సన్ జోస్యం..
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆతిధ్య జట్టు భారత్ చెలరేగిపోతుండగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ వంటి జట్లు కూడా తమ స్ధాయికి మించిన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు అర్హత సాధించగా.. ఇక నాలుగో బెర్తు కోసం పాకిస్తాన్, న్యూజీలాండ్, ఆప్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఫైనల్ పైనా ఉత్కంఠ పెరుగుతోంది.
ఈసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరే అర్హత ఉన్న జట్లపై పలువురు తాజా, మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు తమ అభిప్రాయాల్ని, జోస్యాల్ని వెల్లడిస్తున్నారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్, భారత్ లో పిచ్ లపై ఆడిన సుదీర్ఘ అనుభవం కలిగిన క్రికెటర్ షేన్ వాట్సన్ కూడా ఫైనల్ కు చేరే జట్లపై తన అంచనాల్ని వెల్లడించాడు. ప్రస్తుతం టోర్నీలో మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న షేన్ వాట్సన్ ఫైనల్లో ఆడే జట్లపై చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది.

వరల్డ్ కప్ మ్యాచ్ ల అధికారిక టెలికాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో ఇటీవల జరిగిన ప్రీ-మ్యాచ్ షోలో షేన్ వాట్సన్ ఫైనల్ మ్యాచ్ ఆడే ఇరుజట్లను వెల్లడించాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని 42 ఏళ్ల వాట్సన్ అంచనా వేశాడు. ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న ఈ రెండు జట్లకు ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాట్సన్ వెల్లడించాడు. అలాగే తన అంచనాల వెనుక కారణాన్ని కూడా వాట్సన్ వివరించాడు.
భారత్ ఇప్పటికే వరుసగా ఎనిమిది విజయాలతో జైత్రయాత్ర సాగిస్తోందని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలతో పటిష్టంగా ఉందని వాట్సన్ తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియా కూడా మొదట్లో కాస్త తడబడ్డా ఇప్పుడు తేరుకుని వరుస విజయాలు నమోదు చేస్తోందన్నాడు. కాబట్టి వరల్డ్ కప్ లో ఇతర జట్లతో పోలిస్తే భారత్, ఆస్ట్రేలియా ఇరుజట్లూ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాట్సన్ తెలిపాడు. దీంతో ఇప్పుడు వాట్సన్ జోస్యం నిజమవుతుందా లేదా అనే దానిపై క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications