ఆ గండం గట్టెక్కించు దేవుడా: హోమాలు, పూజలు మొదలయ్యాయ్: ఆలయాలకు పరుగులు
ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో నేడు బిగ్ డే. సెమీ ఫైనల్స్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు, రేపు రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి సెమీ ఫైనల్స్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీనికి వేదిక.. ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
రెండో సెమీస్ కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. 19వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండింటిపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. తొలి సెమీ ఫైనల్స్‌పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు.

ఇంగ్లాండ్‌లో 2019లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో ఇదే న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. పైగా ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్లల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన చరిత్ర టీమిండియాకు ఎప్పుడూ లేదు. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. న్యూజిలాండ్ గండాన్ని ఎలా అధిగమిస్తుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
దీనితో అభిమానులు ఇక ఆలయాలకు పరుగులు పెడుతున్నారు. ఈ తెల్లవారు జాము నుంచే దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ప్లేయర్ల ప్లకార్డులను ప్రదర్శిస్తూ అభిమానులు పూజలు, యాగాలు చేస్తోన్నారు.

తమిళనాడులోని మధురైలో జల్లికట్టు రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈ తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోటరీ క్లబ్ సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజల్లో పాల్గొన్నారు. సెమీ ఫైనల్స్‌లో భారత్ గెలవాలని, దేశం గర్వించేలా చేయాలని తాము పూజలు జరిపినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాలు చెప్పారు.












Click it and Unblock the Notifications