నీ సేవలు ఇక చాలు: కట్టలు తెంచుకున్న ఆగ్రహం..!!
Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పాత పాటే పడుతోంది. బౌలర్లను ఎదుర్కొనడంలో తడబడుతోంది. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, రాదనీ నిరూపించుకుంటోంది.
రెండో రోజు ఆస్ట్రేలియా దుమ్ము దులిపింది. 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగడం.. రెండో రోజు మ్యాచ్‌లో హైలైట్. 140 పరుగులు చేశాడు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అతనికి అద్భుత సహకారాన్ని అందించాడు. ఒకవైపు స్టీవెన్ స్మిత్.. మరో ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించారు.

ఈ క్రమంలో స్మిత్ సెంచరీని పూర్తి చేశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. 49 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో 411 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా.
ఆ తరువాత వచ్చిన మిఛెల్ స్టార్క్‌తో కలిసి ధాటిగా ఆడాడు స్టీవ్ స్మిత్. 455 పరుగుల వద్ద స్టార్క్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్మిత్ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. అదే స్కోర్ వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆకాష్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ ఆడబోయాడు స్మిత్. ఎడ్జ్ తీసుకున్న బంతి ప్యాడ్స్‌కు తగిలి లెగ్ స్టంప్ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. దీనితో అతని మారథాన్ ఇన్నింగ్‌కు తెరపడింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కేప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. అయిదే అయిదు బంతులను ఎదుర్కొని పెవిలియన్ దారి పట్టాడీ లెజెండరీ బ్యాటర్.
పాట్ కమ్మిన్స్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని ఆన్ సైడ్ దిశగా పుల్ చేయబోయాడు రోహిత్. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన ఆ బంతిని స్కాట్ బోలాండ్ సునాయాసంగా అందుకున్నాడు. దీనితో ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది భారత్. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద మరో వికెట్ పడింది. పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లోనే కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 పరుగులు చేశాడు రాహుల్.
రోహిత్ శర్మ మరోసారి విఫలం కావడం అభిమానుల ఆగ్రహానికి అంతు లేకుండా పోయింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ స్కోర్ చేయలేకపోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్‌లో ఆడలేదు. దానికి జస్‌ప్రీత్ బుమ్రా కేప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ గెలుచుకుంది టీమిండియా.
రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో 3, మలి ఇన్నింగ్‌లో 6 పరుగులతో సరిపెట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఆ మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో అతను చేసింది 10 పరుగులే. ఇప్పుడు తొలి ఇన్నింగ్‌లో మూడు పరుగులకే వెనుదిరగడం పట్ల ట్రోల్స్‌కు గురి అవుతున్నాడు.












Click it and Unblock the Notifications