చిచ్చు పెట్టిన కోహ్లీ వ్యవహారం: కెమెరా ముందు తిట్టుకున్న మంజ్రేకర్- పఠాన్
Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పాత పాటే పడుతోంది. బౌలర్లను ఎదుర్కొనడంలో తడబడింది. వరుస వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 164 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోయింది.
474 పరుగులకు ఆలౌట్..
రెండో రోజు ఆస్ట్రేలియా దుమ్ము దులిపింది. 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగడం.. రెండో రోజు మ్యాచ్‌లో హైలైట్. 140 పరుగులు చేశాడు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అతనికి అద్భుత సహకారాన్ని అందించాడు. ఒకవైపు స్టీవెన్ స్మిత్.. మరో ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించారు.

ఆరంభంలోనే వికెట్లు..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. కేప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. అయిదే అయిదు బంతులను ఎదుర్కొని పెవిలియన్ దారి పట్టాడు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. 36 పరుగులకే అవుట్ అయ్యాడు. నైట్ వాచ్‌మెన్‌గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ డకౌట్ కావడం టీమిండియా ఇన్నింగ్‌ను దెబ్బకొట్టింది.
యశస్వి జైస్వాల్ అనూహ్యంగా రనౌట్..
సెంచరీ వైపు దూసుకెళ్తోన్న డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద ఉన్నప్పుడు లేని రన్ కోసం ప్రయత్నించాడు జైస్వాల్. 41వ ఓవర్ చివరి బంతిని యాంగ్లింగ్ చేశాడు. దానిని మిడ్-ఆన్ వైపు షాట్ ఆడాడు. ఆ వెంటనే సింగిల్ కోసం పరుగెత్తాడు.
కోహ్లీ క్రీజ్ నుంచి కదలకపోవడం..
నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లికి రన్ తీయడానికి ఆసక్తి చూపలేదు. రెండడుగులు ముందుకేసి, మళ్లీ వెనక్కి వచ్చాడు. అది గమనించని జైస్వాల్ దాదాపుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి వచ్చేశాడు. కోహ్లీ క్రీజ్ నుంచి కదలకపోవడం, ఆ బంతిని అందుకున్న పాట్ కమ్మిన్స్ నేరుగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వైపు సంధించడం, అతను బెయిల్స్‌ను గిరాటేయడం చకచకా సాగిపోయాయి.
Heated Argument Between Sanjay Manjrekar And Irfan Pathan, Sanjay Manjrekar Was Defaming Virat Kohli While Irfan Pathan Was Defending Virat Kohli ( On Yashasvi Jaiswal Run Out)#INDvsAUS #ViratKohli #YashasviJaiswal#AUSvINDIA pic.twitter.com/8YmOcA8JyL
— Harsh 17 (@harsh03443) December 27, 2024
బోలాండ్ బలి..
దీనితో 153 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాష్ దీప్ డకౌట్ అయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో నాథన్ లియాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని కూడా బోలాండ్ బలి తీసుకున్నాడు. ఫలితంగా 164 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోయింది భారత్.
యశస్వి జైస్వాల్ రనౌట్ అయిన విధానం హాట్ టాపిక్..
యశస్వి జైస్వాల్ రనౌట్ అయిన విధానం హాట్ టాపిక్ అయింది. కామెంటేటర్లుగా వ్యవహరిస్తోన్న టీమిండియా మాజీ ప్లేయర్లు సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ వాగ్వివాదానికి దిగారు. కెమెరా ముందే ఒకరినొకరు వాదులాడుకున్నారు. విరాట్ కోహ్లీ వల్లే జైస్వాల్ అవుట్ కావాల్సి వచ్చిందంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించగా.. దాన్ని తప్పుపట్టాడు పఠాన్.
రన్ తీయడానికి ఎంతో అవకాశం..
రన్ తీయడానికి ఎంతో అవకాశం ఉందని, అది గ్రహించే యశస్వి జైస్వాల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు దూసుకొచ్చాడని మంజ్రేకర్ చెప్పాడు. బంతి స్లోగా వెళ్లిందని, దాన్ని పాట్ కమ్మిన్స్ అందుకుని వికెట్ కీపర్ వైపు విసిరేసేలోగా కోహ్లీ రన్ తీసి ఉండొచ్చనీ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ పొరపాటు కోహ్లీదేనని, స్కూల్ బాయ్ ఎర్రర్ చేశాడంటూ చురకలు అంటించాడు మంజ్రేకర్.
ఇర్ఫాన్ పఠాన్ తప్పుపట్టాడు..
దీన్ని ఇర్ఫాన్ పఠాన్ తప్పుపట్టాడు. రన్ పూర్తవుతుందనే కాన్ఫిడెంట్ కోహ్లీలో కనిపించ లేదని, అందుకే మళ్లీ వెనక్కి వచ్చాడని అన్నాడు. అతని పక్క నుంచే బాల్ దూసుకెళ్లిందని, దాని వేగాన్ని గుర్తించడం వల్లే ఆ పొరపాటు చేయలేదని వ్యాఖానించాడు. రిస్క్ తీసుకోవడం మంచిది కాదని కోహ్లీ భావించి ఉండొచ్చని అన్నాడు.
దీనికి మళ్లీ కౌంటర్ ఇచ్చాడు మంజ్రేకర్..
దీనికి మళ్లీ కౌంటర్ ఇచ్చాడు మంజ్రేకర్. ఇక్కడ రన్ తీయవచ్చా? లేదా? అనేది ఇర్ఫాన్ పఠాన్ కోచింగ్ మాన్యువల్‌లో చేర్చాలని ఎద్దేవా చేశాడు. అప్పటివరకు ఏకాగ్రతగా ఆడిన కోహ్లీ ఈ రనౌట్ తరువాత డిస్టర్బ్ అయ్యాడని, ఓ అనవసర షాట్‌కు తన వికెట్‌ను పారేసుకున్నాడని చెప్పాడు.












Click it and Unblock the Notifications