టీమిండియా కొత్త జట్టు ప్రకటన- కోహ్లీకి చోటు లేదు
Virat Kohli: ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో జయకేతనాన్ని ఎగురవేసిన భారత్.. ఇక మూడో గేమ్‌పై దృష్టి సారించింది. ఈ నెల 15వ తేదీన గుజరాత్‌లోని రాజ్‌కోట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందులోనూ విజయం సాధించడం ద్వారా అయిదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-2 తేడాతో ముందడుగు వేయాలనే పట్టుదలతో ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా షెడ్యూల్ అయిన ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన రాజ్‌కోట్‌లో ఆరంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి రాంచీలో నాలుగో టెస్ట్, మార్చి 7వ తేదీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో చివరి టెస్ట్ షెడ్యూల్ అయింది. ఇందులో ఆధిక్యతను సాధించి, టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చాడు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ. 3, 4 మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఈ రెండింట్లోనూ అందుబాటులో ఉండట్లేదు. రాజ్‌కోట్, రాంచీల్లో జరిగే టెస్టులకు ఎంపిక చేసే తుదిజట్టులో తన పేరును పరిశీలనలోకి తీసుకోవద్దంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌కు విజ్ఞప్తి చేశాడు.
ఇప్పటికే విరాట్ కోహ్లీ హైదరాబాద్, విశాఖపట్నంలల్లో జరిగిన టెస్టుల్లో ఆడని విషయం తెలిసిందే. రాజ్‌కోట్ టెస్ట్‌కు అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేశాడు కోహ్లీ. 3, 4 టెస్టులకూ దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. ధర్మశాలలో జరిగే చివరి టెస్ట్‌కూ అందుబాటులో ఉండట్లేదు.
అదే సమయంలో- గాయాల పాలైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ కెేఎల్ రాహుల్ పేర్లను ఈ జట్టులో చేర్చింది. వారు చివరి మూడు టెస్టులను ఆడతారా? లేదా? అనేది ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉంటుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సైతం ఈ చివరి మూడు టెస్టుల్లోనూ ఆడట్లేదు. తన పేరును పరిశీలనలోకి తీసుకోవద్దంటూ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.
ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్‌తో జరగబోయే చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌ల కోసం కొత్త జట్టును ప్రకటించింది బీసీసీఐ. కీలక మార్పులు చేసింది. యువ రక్తానికి ప్రాధాన్యత ఇచ్చింది. కొత్తగా కుర్ర క్రికెటర్‌ను జట్టులోకి తీసుకుంది. ఆకాష్ దీప్‌కు టెస్ట్ మ్యాచ్‌లను ఆడే అవకాశాన్ని కల్పించింది.
తాజాగా ప్రకటించిన ఈ జట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కేప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ ఝురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.












Click it and Unblock the Notifications