Shoaib Basheer: పాక్ మూలాలున్న ఇంగ్లండ్ స్పిన్నర్ కు వీసా నిరాకరణ-ఇంగ్లిష్ టీమ్ ఫైర్..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ కు శుభారంభం లభించినా భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఓ దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జో రూట్, జానీ బెయిర్ స్టో ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ టెస్టు సిరీస్ కు ఎంపికైన ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇప్పుడు ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా చర్చనీయాంశమయ్యాడు. దీనికి కారణం అతనికి భారత్ వీసా లభించకపోవడమే. అబుదాబీలో ప్రాక్టీస్ సెషన్ లో టీమ్ తో కలిసి పాల్గొన్న షోయబ్ బషీర్ కు ఆ తర్వాత భారత వీసా రాకపోవడంతో అటు నుంచి అటే స్వదేశానికి వెళ్లిపోయాడు. దీనిపై ఇంగ్లండ్ మీడియా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురించింది. ఇదే క్రమంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు.

బషీర్ కు భారత వీసా రాకపోవడం తనను అసంతృప్తికి గురి చేసిందని కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. అబుదాబిలో ఉన్న సమయంలో ఈ విషయం తెలిసి భారత్ కు వెళ్లకూడదని కూడా భావించినట్లు స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ బషీర్ వీసా వివాదం కంటే తాము భారత్ కు వెళ్లకపోతే అది పెద్ద వివాదం అవుతుందని భావించి ఇక్కడకు వచ్చి టెస్ట్ సిరీస్ ఆడుతున్నట్లు స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ లో కేవలం ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 10 వికెట్లు తీసిన బషీర్ కు ఏకంగా టెస్టు జట్టులో చోటు దక్కింది.

మరోవైపు ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కు భారతీయ వీసా రాకపోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. రాబోయే మ్యాచ్ ల కల్లా అతనికి వీసా లభిస్తుందని భావిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు. అయితే పాకిస్తాన్ మూలాలున్నాయన్న కారణంగా బషీర్ కు భారత వీసా లభించలేదన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు కూడా ఇదే కారణంతో వీసా లభించలేదు.












Click it and Unblock the Notifications