IND vs SA 3rd ODI: మూడో వన్డేలో అదరగొట్టిన టీమిండియా, 2-1 తేడాతో సిరీస్ కైవసం
పారి: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా మరో సిరీస్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన నిర్ణయాత్మక చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి 2-1 తేడీతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేయడం.. ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది.
మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 108 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ 52 పరుగులతో రాణించాడు. చివరగా రింకూ సింగ్ 38 పరుగులతో మెరిశాడు. అనంతరం 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు.

45.5 ఓవర్లలోనే 218 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది దక్షిణాఫ్రికా. దీంతో భారత్ 78 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ జోర్డీ 81 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత మార్క్రమ్ 36 మినహా దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్ చేరుకున్నారు.
భారత బౌలర్లలో ఆర్ష్ దీప్ సింగ్ 4 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ 2, ఆవేశ్ ఖాన్ 2, అక్షర్ పటేల్, ముకేష్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ క్రమంలో మూడో వన్డేలో సెంచరీతో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మూడు వన్డేల సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ వేసి అత్యధిక వికెట్లు తీసిన ఆర్ష్ దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపొందగా.. మొదటి, మూడో వన్డేల్లో భారత్ విజయం సాధించడంతో భారత్ 2-1తో వన్డే సిరీస్‌ను దక్కించుకుంది.












Click it and Unblock the Notifications