క్రికెట్ సమరం, ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ - భారత్ కు ఆ టీంతోనే ముప్పు..!!
క్రికెట్ పండుగ మొదలైంది. కోట్లాది మంది నిరీక్షిస్తున్న మెగా టోర్నీ(Cricket World Cup) వచ్చేసింది. పుష్కరకాలం తర్వాత భారత్ తిరిగి ఆతిథ్యమివ్వడం క్రికెట్ ప్రేమికులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. అలాగే తొలిసారిగా భారత్(Team India) ఈ టోర్నీని సొంతంగా నిర్వహిస్తోంది. మొత్తం 46 రోజుల పాటు వరల్డ్‌కప్(World Cup) జరుగనుంది. ఇందులో 43 రోజులు గ్రూప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇంతకీ మెన్ ఇన్ బ్లూ (Team India)కున్న విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి..ఏం టీంతో అసలు ముప్పు ఉంది..
క్రికెట్ లవర్స్‌కు ఫుల్‌ఫీస్ట్ :క్రికెట్ ఫీవర్ దేశాన్ని ఊపేయనుంది. అసలైన క్రికెట్ మజా ఆస్వాదించేందుకు కోట్లాది మంది ఫ్యాన్స్ సిద్దమయ్యారు. ఈ రోజున ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఇదే గ్రౌండ్ లో జరగనుంది. బుధవారం రాత్రి సంప్రదాయబద్ధంగా కెప్టెన్స్ డే ఈవెంట్‌ను నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ క్లబ్ హౌస్‌కు చెందిన బాంక్వెట్ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 10జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. విశ్లేషకులు సెమీస్ కు చేరే జట్లు..ఫైనల్ లో తలపడే టీంలు...ప్రపంచ కప్ విన్నర్ ఎవరనే అంచనాలతో మరింత ఉత్కంఠ పెంచుతున్నారు.

టీమిండియా పై భారీ అంచనాలు:భారత్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కప్ రేసులో ముందున్నాయి. వామప్ మ్యాచ్‌ల్లో ఈ మూడు జట్లు ప్రత్యర్థులపై అలవోకగా 300 ప్లస్ స్కోర్లు చేశాయి. ఇక, పాక్ జట్టును తక్కువ అంచనా వేయలేం. కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఆ జట్టు సొంతం. 1992 తర్వాత ఈ జట్టు మరోసారి విజేత కాలేకపోయింది. ఉపఖండ పిచ్‌లపై శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘాన్ జట్లు కూడా ప్రత్యర్థులకు సవాల్ విసరగలవు. వెరసి టోర్నీలో హోరాహోరీ మ్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేయనున్నాయి. టీం ఇండియాలో నాణ్యమైన ఆటగాళ్లకు కొదువలేదు. పైగా వన్డేల్లో నెంబర్‌వన్ జట్టుగా టోర్నీలో అడుగుపెట్టనుంది. ఈ నెల 8న ఆస్ట్రేలియాతో టైటిల్ వేటను ఆరంభించనుంది. గిల్ సూపర్ ఫామ్‌లో ఉండడం రాహుల్, శ్రేయాస్ ఫిట్‌నెస్ ను నిరూపించుకోవడంతో పాటు రోహిత్, విరాట్‌ల అనుభవం జట్టుకు కలిసిరానుంది.
ఆ టీంతోనే భారత్ కు ముప్పు:ఇక్కడ ఈ ప్రపంచ కప్ తొలి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు దుర్భేధ్య ఫామ్‌లో ఉంది. న్యూజీలాండ్ సైతం హాట్ ఫేవరెట్ లిస్టులో టాప్ ఫోర్ లో కొనసాగుతోంది. దూకుడుకు మారు పేరుగా నిలుస్తున్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి హాట్ ఫేవరెట్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెన్ స్టోక్స్‌తో పాటు జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, జో రూట్, డేవిడ్ మలన్, హ్యారీ బ్రూక్ లాంటి హార్డ్ హిట్టర్లతో ఆ జట్టు బలీయంగా ఉంది. ప్రస్తుతం భారత్ కు ఈ టీం నుంచే ముప్పు పొంచి ఉంది. అయిదు సార్లు గెలిచిన ఆసీస్ సంచలనాలకు మారుపేరుగా గట్టి పోటీ దారుగా నిలుస్తోంది. అంచనాలకు అందని ఆటతో పాకిస్థాన్ ఆటను తక్కవ అంచనా వేయలేం. దీంతో, టీమిండియా మరో సారి ప్రపంచ విజేతగా నిలవాలనే కోట్లాది అభిమానుల ఆకాంక్షల నడుమ.. క్షణక్షణం ఉత్కంఠ పెంచేలా సమరం మొదలైంది.












Click it and Unblock the Notifications