6 పరుగులకు 4 వికెట్లు: వెన్ను విరిచిన ఇంగ్లాండ్ బౌలర్
India vs England 5th test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్ లో భారత్.. తడబడింది. తొలి ఇన్నింగ్ లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట మొదలైన గంటలోపే ఇన్నింగ్ ముగిసిపోయింది. చివరి నాలుగు వికెట్లను కూడా ఆరు పరుగుల తేడాతో కోల్పోవాల్సి వచ్చింది.
అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు జరిగిన నాలుగింట్లో ఇంగ్లాండ్ రెండింట్లో విజయం సాధించింది. 2-1 తేడాతో ఆధిక్యతను సాధించింది. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్ ను సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్, సమం చేయడానికి టీమిండియా శాయశక్తులా ప్రయత్నిస్తోన్నాయి.

ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులతో రెండో ఇన్నింగ్ ను ఆరంభించిన టీమిండియా బ్యాటింగ్ ఎంతో సేపు సాగలేదు. 52 పరుగులతో కరుణ్ నాయర్, 14 పరుగులతో తొలి రోజు క్రీజ్ లో నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్.. రెండో రోజు ఎక్కువ సేపు ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు.
కరుణ్ నాయర్ 57, ధృవ్ జురెల్ 19 పరుగులకు అవుట్ అయ్యారు. ఈ రెండు వికెట్లు పడిన తర్వాత జట్టు కుప్పకూలింది. చివరి నాలుగు వికెట్లను కూడా ఆరు పరుగుల తేడాతో కోల్పోయింది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ అయ్యారు. ఆకాష్ దీప్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు.
ఇంగ్లాండ్ బౌలర్లల్లో గస్ అట్కిన్సన్ చెలరేగాడు. అయిదు వికెట్లు నేల కూల్చాడు. జోష్ టోంగ్ అతనికి పూర్తి సహకారాన్ని అందించాడు. మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ వోక్స్ ఓ వికెట్ తీసుకున్నాడు. గాయం వల్ల అతను ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.
అనంతరం ఇన్నింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్.. ధాటిగా ఆడుతోంది. వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ- 20 బంతుల్లో అయిదు ఫోర్లతో 20, బెన్ డకెట్... మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 బంతుల్లోనే 29 పరుగులతో ఆడుతున్నారు. మెరుపువేగంతో వారి ఇన్నింగ్ సాగుతోంది.












Click it and Unblock the Notifications