India-New Zealand Match: భారత్-కివీస్ సెమీస్ టికెట్లకు భారీ డిమాండ్-బ్లాక్ లో లక్షకు పైమాటే ?
భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే సెమీ ఫైనల్ పోరుకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే ఆన్ లైన్, కౌంటర్లలో ఎప్పుడో అమ్ముడయ్యాయి. అయితే బ్లాక్ మార్కెట్లో మాత్రం ఇవాళ్టికీ టికెట్లు అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ బ్లాక్ మార్కెట్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అతను చెప్పిన వివరాలు విని పోలీసులు కూడా షాకయ్యారు.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న రోషన్ గురుబక్షాని అనే ఓ వ్యక్తిని ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు. రోషన్ గురుబక్షని భారత్-సెమీస్ సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్లను ఒక్కొక్కటి లక్షా 20 వేల చొప్పున అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రోషన్ గురుబక్షనితో పాటు మరొక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడిన రెండవ నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఉదయం భారత్-కివీస్ మ్యాచ్ టికెట్లకు ఉన్న డిమాండ్ ను స్పష్టం చేస్తోంది. ఇప్పటికే వరుస విజయాలతో భారత్ సెమీస్ చేసిన నేపథ్యంలో ఇవాళ కివీస్ పైనా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఆసక్తికర మ్యాచ్ ను ఎలాగైనా వీక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు వీఐపీలకు సైతం టికెట్లు దొరక్కపోవడంతో వారు కూడా బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రపంచకప్ మ్యాచ్ టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ ముండే అభిమానుల్ని కోరారు. బ్లాక్ మార్కెటీర్లను నమ్ముకుని మోసపోవద్దని చెప్తున్నారు. ఎక్కువ ధరలకు బ్లాక్ లో మ్యాచ్ టికెట్లు విక్రయించే వారిపై నిఘా పెట్టినట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications