రోహిత్ 3, యశస్వి 5, గిల్ 4.. ఏంటి మాస్టార్ ఈ స్కోర్లు..
రోహిత్ 3, యశస్వి 5, గిల్ 4, పంత్ 1.. ఇవి ర్యాంకులు కాదండీ బాబు... స్కోర్లు. అవును టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్.. రంజీ ట్రోఫీలో సాధించిన స్కోర్లు ఇవి. రంజీ ట్రోఫీలో కోహ్లీ మినహా.. రోహిత్ , పంత్, గిల్, యశస్వీ జైశ్వాల్, జడేజా ఆడారు. అయితే వీళ్లు తొలి మ్యాచ్ లోనే ఇలా ఘోరంగా విఫలం కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశగాలోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు టీమిండియా జట్టులో సెంచరీలు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వీళ్లు.. ఇలా రంజీ ట్రోఫీలో సింగిల్ డిజిట్ కే చేతులెత్తేయడం ఫ్యాన్స్ కు మింగుడు పడడంలేదు.
సింగిల్ డిజిట్ స్టార్స్..
టీమిండియా సారథి రోహిత్ శర్మ మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు. ఇప్పటికే ఆసిస్ టూర్ లో చేతులెత్తేసి ఫ్యాన్స్ ను నిరాశ పర్చిన రోహిత్.. మరోసారి రంజీలోనూ 19 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇటీవల జరిగిన ఆసీస్ టూర్ లో ఐదు ఇన్నింగ్స్ లో కేవలం 31 పరుగులే చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ సగటు స్కోరు 6.21గా ఉంది. గత 15 టెస్టు ఇన్నింగ్స్ లో రోహిత్ కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టుల్లో అతని సగటు 10.93 గా ఉంది.

ఇక రోహిత్ .. రంజీలో ఆడక చాలా ఏళ్లే అయింది. అతడు రంజీలో పాల్గొని 3,365 రోజులు అయింది. ఇక యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సైతం రోహిత్ బాట పట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ చేరాడు. ప్రస్తుతం రోహిత్, జైశ్వాల్ ముంబయి జట్టుకు ఆడుతున్నవిషయం తెలిసిందే. జమ్ము కశ్మీర్ తో ఈ జట్టు తలపడింది. ముంబయి కెప్టెన్ అజింక్య రహానె (12), శ్రేయస్ అయ్యర్ (11) సైతం పేలవ ప్రదర్శన చేశారు.
టీమిండియా యువ ఆటగాడు శుభ్ మన్ గిల్.. రంజీలో పంజాబ్ కెప్టెన్ గా బరిలోకి దిగాడు. కర్ణాటకతో ఈ మ్యాచ్ జరిగింది. గిల్ 8 బంతుల్లో నాలుగు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు సౌరాష్ట్రతో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ జట్టు ప్లేయర్ భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ది కూడా అదే పరిస్థితి. కేవలం 10 బంతులు ఆడిన పంత్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
న్యూజీలాండ్ తో సిరీస్ తో స్టార్ట్ అయిన టీమిండియా పేలవ ప్రదర్శన ఇప్పటికీ కొనసాగుతోంది. మరి రానున్న ఛాంపియన్ ట్రోపీలోనైనా తిరిగి మనవాళ్లు పుంజుకుంటారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications