కేప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించడానికి అక్షరాలా రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన ముంబై ఇండియన్స్
Mumbai Indians: ప్రారంభానికి ముందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్‌లో పెను సంచలనం సృష్టించిన అంశం.. కేప్టెన్ రోహిత్ శర్మపై వేటు పడటం. జట్టుకు సారధిగా వ్యవహరిస్తోన్న రోహిత్ శర్మను ఒక్క ఉదుటున తొలగించింది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్. అతని స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కేప్టెన్‌గా నియమించింది.
ఇదివరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హార్దిక్ పాండ్యాను రెండు సీజన్ల కిందటే రిలీజ్ చేసింది ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం. 2022 మెగా ఆక్షన్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ అతన్ని జట్టులోకి తీసుకుంది. కేప్టెన్‌ను చేసింది. మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు హార్దిక్. అదే ఏడాది గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.

హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఈ సీజన్‌లో కూడా అదే రేంజ్‌లో దుమ్ము దులిపింది గుజరాత్ టైటాన్స్. తిరుగులేని విజయాలను అందుకుంది. ఫైనల్స్‌కు చేరుకుంది. తృటిలో టైటిల్‌ను కోల్పోయింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. అయినప్పటికీ దాని బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గలేదు.
అదే సమయంలో చివరి రెండు ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ నాసిరకం ఆటతీరును ప్రదర్శించిన విషయం తెలిసిందే. 2022లో అట్టడుగు స్థానంలో అంటే 10వ స్థానానికి దిగజారింది. ఈ సీజన్‌లో ఫర్వాలేదనిపించుకోగలిగిందంతే. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలవగలిగింది.

ఈ పరిణామాలు- హార్దిక్ పాండ్యా వాల్యూను అమాంతం పెంచేశాయి. రోహిత్ శర్మ కంటే హార్దిక్ పాండ్యానే బెటర్ అనిపించుకునేలా చేసింది. ఫలితంగా మళ్లీ అతన్ని జట్టులోకి తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆసక్తి చూపింది. అతన్ని జట్టులోకి తీసుకోవడమే కాదు.. రోహిత్ శర్మను సైతం పక్కన పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. రోహిత్‌ను తొలగించి హార్దిక్ పాండ్యాను కేప్టెన్‌గా నియమించింది.
దీనికోసం ముంబై ఇండియన్స్ ఏకంగా 100 కోట్ల రూపాయలను గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించిందనే వార్తలు గుప్పు మన్నాయి. ఎంట్రీ ఇచ్చిన రెండు సీజన్లల్లోనే జట్టును ఒకసారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ అంత సులువుగా అంగీకరించలేదని, దీనికి ప్రతిగా 100 కోట్ల రూపాయలను ముంబై ఇండియన్స్ నుంచి తీసుకుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications