SRH vs CSK: మలుపు తిప్పిన మలింగా.. గెలిపించిన ప్రఫుల్ హింగే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై గెలుపొందింది. ఇషాన్ మలింగా తీన్మార్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పితే.. ప్రఫుల్ హింగే ఆఖరి ఓవర్‌ను కట్టడిగా వేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
195 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఆయుష్ మాత్రే(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30), మాథ్యూ షార్ట్(30 బంతుల్లో 3 ఫోర్లతో 34), శివమ్ దూబే(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21) పోరాడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(3/29) మూడు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. శివాంగ్ కుమార్(1/18), సాకిబ్ హుస్సేన్(1/32), ప్రఫుల్ హింగే(1/60) చెరో వికెట్ తీసారు.

అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59), హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/22), జెమీ ఓవర్టన్(3/37) మూడేసి వికెట్లు తీయగా..ముఖేష్ చౌదరి(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్జప్నీత్ సింగ్(1/34)కు ఒక వికెట్ దక్కింది.
మలుపు తిప్పిన మలింగా..
195 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆయుష్ మాత్రే దూకుడైన బ్యాటింగ్‌తో ఆ జట్టు 76 పరుగులు చేసింది. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ మాథ్యూ షార్ట్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేయగా.. మలింగా దెబ్బతీసాడు.
సర్ఫఱాజ్ ఖాన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే డేంజరస్ డెవాల్డ్ బ్రేవిస్(0)ను శివాంగ్ కుమార్ క్యాచ్ ఔట్ చేయడంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మళ్లింది. మాథ్యూ షార్ట్(34)ను మలింగా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. శివమ్ దూబే(21)ను హుస్సేన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అన్షుల్ కంబోజ్ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు.
గెలిపించిన ప్రఫుల్ హింగే..
ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. ఇషాన్ కిషన్ ప్రఫుల్ హింగేకు బంతినిచ్చాడు. అప్పటికే అతను 3 ఓవర్లలో 53 పరుగులిచ్చుకోవడంతో అందరూ భయపడ్డారు. అందుకు తగ్గట్లే ప్రఫుల్ హింగే నోబాల్ వేసి టెన్షన్ పెట్టాడు. కానీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 7 పరగులే ఇచ్చి జేమీ ఓవర్టన్‌ను ఔట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ విజయం లాంఛనమైంది.
రాజస్థాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లోనూ ప్రఫుల్ హింగే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన సంగతి తెలిసిందే. తన అరంగేట్ర మ్యాచ్ ఫస్ట్ ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. తాజా మ్యాచ్‌లో తొలి 3 ఓవర్లలో విఫలమైనా.. ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి మరోసారి హీరో అయ్యాడు.












Click it and Unblock the Notifications