T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ మరోసారి భారత జట్టుపై తన అక్కసును వెళ్లగక్కాడు. టోర్నీ ఆరంభం నుంచి భారత్‌పై పడి ఎడుస్తున్న అమీర్.. మరోసారి వ్యతిరేక కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని అమీర్ జోస్యం చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏది చూసుకున్నా.. భారత్ కంటే న్యూజిలాండ్ పటిష్టంగా ఉందని తెలిపాడు.
అయితే ఈ టోర్నీలో మహమ్మద్ అమీర్ అంచనాలు ఏవి ఫలించలేదు. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తప్పా.. అతను చెప్పింది ఏది నిజం కాలేదు. వెస్టిండీస్ చేతిలో ఓడుతుందని, సెమీఫైనల్ చేరకుండానే భారత్ ఇంటిబాట పడుతుందని అమీర్ చెప్పాడు. అది నిజం కాకపోవడంతో సంజూ శాంసన్‌తో గట్టెక్కిందని, సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతుందని తెలిపాడు. కానీ అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు ఫైనల్లో కూడా ఓడుతుందని తన అక్కసును వెళ్లగక్కాడు. 'న్యూజిలాండ్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఫైనల్‌కు చేరుకోవడం రెండు జట్లకు ఒక ఘనత వంటిదే. అయితే మొత్తంగా చూస్తే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో న్యూజిలాండ్ బలంగా కనిపిస్తోంది. ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్లో వారు భారత్‌ను ఓడించగలరని నేను భావిస్తున్నాను.' అని అమీర్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను భారత్ ఇప్పటి వరకు ఓడించలేదు. భారత్‌ను న్యూజిలాండ్ మాత్రం మూడు సార్లు ఓడించింది. 2007, 2016, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. న్యూజిలాండ్ చేతిలో ఓడినా.. 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. గత రికార్డ్ బాలేకున్నా.. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచింది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం సూపర్-8 దశలో తమ చివరి మ్యాచ్‌ను ఓడిపోయింది. కాకపోతే సెమీఫైనల్లో పటిష్టమైన సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.












Click it and Unblock the Notifications