సూర్యకుమార్ యాదవ్ వచ్చి నా ముందు నిల్చుంటేనే..ట్రోఫీ ఇస్తా
ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత ట్రోఫీ ప్రదానం విషయంలో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ట్రోఫీని భారత్ కు అందించే విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చేసిన తాజా సూచనలను కూడా ఆయన పెడచెవిన పెట్టారు. ట్రోఫీని భారత జట్టుకు నేరుగా ఇవ్వడానికి నిరాకరించారు. బీసీసీఐకి ఘాటుగా బదులిచ్చారు.
భారత జట్టు కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యాలయానికి వచ్చి ట్రోఫీని తీసుకోవాలని నఖ్వీ సూచించినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఈ మేరకు దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య టీమిండియా తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకపోవడాన్ని నఖ్వీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారని, ఇది ఒక్క పీసీబీకి మాత్రమే కాకుండా పాకిస్తాన్ ను కించపర్చినట్టయిందని భావిస్తోన్నారని పేర్కొంది.

ట్రోఫీని నఖ్వీ తన వెంట తీసుకెళ్లిపోయిన నేపథ్యంలో దీన్ని తిరిగి తెప్పించుకోవడానికి బీసీసీఐ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏసీసీని స్వయంగా సంప్రదించట్లేదు గానీ.. ఈ విషయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ద్వారా సంప్రదింపులు జరుపుతోంది. ట్రోఫీని భారత్ కు పంపించాలని ఆ క్రికెట్ బోర్డు వైస్ ఛైర్మన్ ద్వారా ఆదేశించింది బీసీసీఐ. ఈ అభ్యర్థనను నఖ్వీ నిర్ద్వంద్వందంగా తిరస్కరించారు.
ఏ కేప్టెన్ అయితే తన చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించారో.. అదే కేప్టెన్ స్వయంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయానికి వస్తేనే దాన్ని ఇస్తానని, అది కూడా తన చేతుల మీదుగానే స్వీకరించాల్సి ఉంటుందని పట్టుబట్టారు. దుబాయ్‌లో నఖ్వీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ సమావేశంలో కూడా ఈ అంశం ఇదివరకే చర్చకు వచ్చింది. ట్రోఫీ కోసం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అప్పగింతపై పట్టుబట్టగా.. ఇది అజెండాలో లేదని నఖ్వీ ఘాటుగా బదులిచ్చారు.












Click it and Unblock the Notifications