టీమిండియాతో వన్డే సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు డబుల్ బ్లో: ఇద్దరు కీ ప్లేయర్లు అవుట్
భారత్ తో ముగిసిన అయిదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కోల్పోయినప్పటికీ.. చివరి రెండు మ్యాచ్ లల్లో సాధించిన వరుస విజయాలతో జోష్ లో ఉంది న్యూజిలాండ్. ఈ సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్ లను భారత్ గెలవగా.. చివరి రెండింటినీ తన ఖాతాలో వేసుకుంది కివీస్. ఈ రెండింట్లో కూడా బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చూపింది. అదే ఊపుతో ఇక వన్డే సిరీస్ కోసం సమాయాత్తమౌతోంది. అయిదు మ్యాచ్ ల సిరీస్ ఇది.
4వ తేదీన ఆక్లాండ్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ లో మొదటి మూడు, చివరి రెండు వన్డేల కోసం వేర్వేరుగా జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్. ఈ సిరీస్ కోసం ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. సిరీస్ మొత్తానికీ దూరం అయ్యారు. ఇది.. న్యూజిలాండ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. భారత్ తో టీ20 సిరీస్‌కు కూడా గాయాల వల్లే వీరిద్దరూ దూరమైన విషయం తెలిసిందే. అదే ఇక్కడా కొనసాగుతోంది.

ఆ ఇద్దరూ.. రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆడుతున్న సమయంలో చాప్మాన్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అలాగే.. ఓ యాడ్ షూటింగ్ సమయంలో రచిన్ రవీంద్ర కుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి మరింత విశ్రాంతి అవసరమని బోర్డు పేర్కొంది.
ఆటగాళ్ల గాయాలపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందించారు. చాప్మాన్, రచిన్ రవీంద్ర వంటి మ్యాచ్ విన్నర్లు దూరం కావడం నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ నెల చివర్లో ప్రారంభం అయ్యే టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని, వారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతోనే వన్డే సిరీస్ నుంచి తప్పించినట్లు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కివీస్ సెలెక్టర్లు జట్టులో పలు మార్పులు చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్, ఎడమచేతి వాటం బ్యాటర్ హెన్రీ నికోల్స్‌లను తొలి మూడు వన్డేలకు ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ చివరి రెండు వన్డేల కోసం జట్టులోకి రానున్నాడు. పేసర్ మ్యాట్ ఫిషర్‌ను కూడా మొదటి మూడు మ్యాచ్‌లకే అందుబాటులోకి వచ్చాడు. తొడ గాయంతో బాధపడుతున్న మ్యాట్ హెన్రీ ఫిట్నెస్ను నవంబర్ 2న సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.
తొలి 3 వన్డేల జట్టులో.. మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, మ్యాట్ హెన్రీ, కైలే జేమీసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిఛెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లెయిర్ టిక్నర్ ను తీసుకున్నారు.
చివరి 2 వన్డేల జట్టులో.. మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, లాకీ ఫెర్గూసన్, మిచెల్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్ కు చోటు కల్పించారు.













Click it and Unblock the Notifications
