ప్లేయర్లు కాదు.. సెలక్టర్లే అసలు విలన్లు!
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం సూపర్-8 దశతోనే ముగిసింది. శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్‌ను అధిగమించలేక పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ ఘోర వైఫల్యానికి ఆటగాళ్ల ప్రదర్శన కంటే.. సెలక్టర్ల అనాలోచిత నిర్ణయాలే ప్రధాన కారణమని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు.
మిడిలార్డర్ లేని జట్టు.. ఎలా గెలుస్తుంది?
పాకిస్థాన్ 15 మంది సభ్యుల జట్టును పరిశీలిస్తే.. అందులో ఒక్కడంటే ఒక్కడు కూడా సరైన మిడిలార్డర్ బ్యాటర్ లేకపోవడం గమనార్హం. జట్టులోని ఏడుగురు ప్రధాన బ్యాటర్లు (బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, ఖవాజా నఫీ) అందరూ టాపార్డర్ లేదా ఓపెనర్లే. దేశవాళీ క్రికెట్, టీ20 లీగ్‌లలో ఓపెనింగ్ చేసే ఆటగాళ్లను తీసుకొచ్చి, బలవంతంగా నంబర్ 4, 5 స్థానాల్లో ఆడించడం సెలక్టర్ల వైఫల్యానికి నిదర్శనం.

ఫినిషర్లు ఎక్కడ?
టాపార్డర్ తర్వాత జట్టులో ఉన్నది కేవలం లోయర్ ఆర్డర్ ఆల్‌రౌండర్లు మాత్రమే. షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్ వంటి వారు నిలకడగా రాణించే ఫినిషర్లు కాదు. షాదాబ్ కొన్నిసార్లు మెరుపులు మెరిపించినా.. కీలక సమయంలో జట్టును గెలిపించే నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్ పాక్ జట్టులో లేడు. సరైన ఫినిషర్ లేకపోవడం వల్లే పాకిస్థాన్ భారీ స్కోర్లు చేయలేకపోతోంది.
శ్రీలంక మ్యాచ్‌తో బట్టబయలైన బలహీనత
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బలహీనత స్పష్టంగా కనిపించింది. ఓపెనర్లు అద్భుతంగా ఆడి 15.5 ఓవర్లలోనే 176 పరుగులు జోడించారు. ఆ సమయంలో పాక్ కనీసం 230 పరుగులు చేస్తుందని అందరూ భావించారు. కానీ మిడిలార్డర్ వైఫల్యంతో ఆఖరి 25 బంతుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరు తప్ప మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
ఇదే తరహా పరిస్థితి 2025 ఆసియా కప్ ఫైనల్లో కూడా ఎదురైంది. అప్పుడు కూడా 84 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన పాక్.. ఆ తర్వాత కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. సెలక్టర్లు ఇప్పటికైనా మేల్కొని జట్టులో సమతుల్యత ఉండేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications