RCB సంచలన నిర్ణయం- ఇక ప్రతీ మ్యాచ్ కూ స్టేడియంలో ఆ 11 సీట్లు రిజర్వ్..!
మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ (IPL 2026) సీజన్ ప్రారంభం కాబోతోంది. తొలి విడతగా జరిగే 20 మ్యాచ్ లకు బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ మ్యాచ్ లు ముగిసేలోపు రెండో విడత మ్యాచ్ ల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. దీంతో ఐపీఎల్ లో అన్ని జట్లూ టోర్నీ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.
గతేడాది ఐపీఎల్ 2025 టైటిల్ గెల్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ ఎత్తున వేడుకలకు ప్లాన్ చేసింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు సరిగ్గా ప్లాన్ చేయకపోవడంతో అభిమానులు ఊహించిన దాని కంటే భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది ఫ్యాన్స్ చనిపోయారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆర్సీబీ.. ఈసారి నష్టనివారణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరిగి ఫ్యాన్స్ అభిమానం పొందేందుకు ఈసారి తాము ఆడే మ్యాచ్ లకు స్టేడియాల్లో 11 సీట్లు సదరు బాధితుల పేరుతో రిజర్వ్ చేయాలని నిర్ణయించింది.

లివర్‌పూల్ హిల్స్‌బరో స్మారక చిహ్నం వంటి ప్రపంచవ్యాప్త క్రీడా నివాళుల తరహాలో ఆర్సీబీ ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లలో స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా రిజర్వ్ చేయనుంది. జట్టు తొలి టైటిల్ వేడుకల సమయంలో జూన్ 4న జరిగిన తొక్కిసలాట బాధితులకు నిశ్శబ్ద నివాళిగా ఈ సీట్లు ఖాళీగా ఉంచుతారు. అలాగే ఈ సీజన్‌లో ఆటగాళ్లు అన్ని ప్రాక్టీస్ సెషన్‌లలో 11వ నంబర్ జెర్సీని ధరిస్తారు. మృతుల్ని స్మరించుకోవడానికి వీలుగా స్టేడియం లోపలి ప్రవేశ ద్వారం సమీపంలో ఒక స్మారక ఫలకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. చిన్నస్వామి స్టేడియంలో మార్చి 28న ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ తోనే ఇవన్నీ అమలు చేస్తారు.












Click it and Unblock the Notifications