ఇండియా ఈజ్ ఎ బిగ్ లూజర్.. : ఆస్ట్రేలియా లెజెండ్ క్లారిటీ
ఆసియా కప్ లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో తలెత్తిన షేక్ హ్యాండ్ వివాదం మలుపులు తిరుగుతోంది. దీనిపై ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీనికి కారణమైన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ ప్యానల్ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. లేకపోతే టోర్నమెంట్ నుంచి వైదొలగుతామని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి హెచ్చరించారు. దీన్ని- ఐసీసీ తోసిపుచ్చింది.
అదే సమయంలో- ఈ వివాదం ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ కు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ విషయంలో పాకిస్తాన్ ను సమర్థిస్తూ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల సాంకేతికంగా భారత్ గెలిచినా.. నైతికంగా ఓడిపోయిందని ఆయన స్కై స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలొచ్చాయి. పాకిస్తాన్ ప్లేయర్లు నిఖార్సయిన యోధులుగా ఆయన ప్రశంసించినట్లు వేర్వేరు సోషల్ మీడియా అకౌంట్లల్లో పోస్ట్ అయింది.

దీనిపై రికీ పాంటింగ్ స్పందించారు. దీన్ని ఆయన ఖండించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రికీ పాంటింగ్ స్పష్టం చేశారు. ప్రచారంలో ఉన్న ఈ ప్రకటనలు అవాస్తవమని, తాను ఆసియా కప్‌పై ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పాంటింగ్ తన ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ పై తన పేరు మీద కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయని, వాటితో తనకు సంబంధం లేదని అన్నారు.
ఆసియా కప్‌పై నేను ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదని తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమైనవని వివరణ ఇచ్చారు. ఆసియా కప్ పై స్కై స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా కామెంటరీ ప్యానెల్ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఆసియా కప్ మ్యాచ్ లను స్కై స్పోర్ట్స్ ప్రసారం చేస్తోందనడానికి ఆధారాలు కూడా లేవని చెప్పారు. స్కై స్పోర్ట్స్ ఈవెంట్ లో ఆసియా కప్ మ్యాచ్‌లు ఏవీ లేనప్పుడు తాను ఎలా ఆ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications