ఓటమి ముందే ఒప్పుకొన్న పాకిస్తాన్ కేప్టెన: మాకంటే భారత్ చాలా బెటర్
ఇంకొక్క రోజే మిగిలివుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆర్క్ రైవల్స్ భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. శ్రీలంక దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీనికోసం రెండు జట్లూ ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. ఇప్పటికే రెండు జట్లూ కొలంబోకు చేరుకున్నాయి కూడా. పాకిస్తాన్ జట్టు పరిస్థితెలా ఉన్నప్పటికీ.. టీమిండియా మాత్రం ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది.
తాజాగా కొలంబో ప్రేమదాస స్టేడియంలో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా. భారత్ తో పోరు ఎప్పటికీ ప్రతిష్ఠాత్మకమైనదేనని అన్నారు. రెండు దేశాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ మ్యాచ్ ను ఎంతో ఆసక్తిగా, అంతకుమించిన ఉత్కంఠతగా చూస్తారని పేర్కొన్నాడు. ఈ హైవోల్టేజ్ పోరు.. అనవసర ఉద్రిక్తతలు లేకుండా, సద్భావనతో, క్రీడా స్ఫూర్తితో సాగాలని సల్మాన్ ఆఘా ఆకాంక్షించారు.

దాయాదుల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పరస్పరం హ్యాండ్‌షేక్, గౌరవ భావం ఉండాలని అన్నాడు. భారత జట్టుతో కరచాలనానికి తమ జట్టు సిద్ధంగా ఉందని ప్రకటించాడు. టాస్ వేసినప్పుడు, మ్యాచ్ ముగినప్పుడు టీమిండియా ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తాము సిద్ధమని, తుది నిర్ణయం భారత్ పైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
భారత్ తో మ్యాచ్ ను టాస్ ప్రభావితం చేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు ఆఘా బదులిచ్చాడు. టాస్ కాకుండా ఎలా ఆడతామనేదే ఫలితాన్ని నిర్ణయిస్తుందని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్ మొత్తం కూడా క్రీడాస్ఫూర్తితో ఆడాలని తమ జట్టులోని ప్రతి ఒక్కరూ కోరుకుంటోన్నారని వ్యాఖ్యానించాడు. ప్రారంభం నుండి ఎలా ఆడామో అలాగే ఆడాలని, నాణ్యమైన క్రికెట్ ఆడితే గెలుస్తారని పేర్కొన్నాడు
మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై వస్తున్న విమర్శలను సల్మాన్ కొట్టిపారేశాడు. ఐసీసీ అతనికి క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశాడు. భారత్ వైపు నుంచే అతనిపై అనవసర ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఉస్మాన్ తారిఖ్ గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుందో తనకు తెలియదని, అతనికి ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా భారత్ అతన్ని హైప్ చేసిందని అన్నాడు. ఉస్మాన్ తారిఖ్ మాత్రం ఇదంతా పట్టించుకోవట్లేదని, ఈ వివాదాలు అతని ప్రదర్శనను ప్రభావితం చేయబోవని ధీమా వ్యక్తం చేశారు.
టీమిండియాపై తమకు మంచి ట్రాక్ రికార్డు లేదని ఆఘా అంగీకరించాడు. చరిత్రను మార్చలేమని వ్యాఖ్యానించాడు. ప్రతీ రోజూ కొత్తదేనని, గెలవడానికే ఎవ్వరైనా మ్యాచ్ ఆడతాడని పేర్కొన్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ఓ అద్భుతమైన ఆటగాడిగా అభివర్ణించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో తాము బాగా ఆడాలని కోరుకుంటున్నామని, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని సల్మాన్ అలీ చెప్పాడు.












Click it and Unblock the Notifications