కుక్కకాటు నుంచి తృటిలో బయటపడ్డ టీమిండియా స్టార్ బ్యాటర్
క్రికెట్ హంగామా ఆరంభం కాబోతోంది. రేపటి నుండి భారత్- న్యూజిలాండ్ మధ్య సిరీస్ మొదలు కానుంది. మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు తొలి మ్యాచ్. గుజరాత్ లోని వడోదర స్టేడియం దీనికి వేదిక. ఆ తర్వాత 14న రాజ్ కోట్, 18న ఇండోర్ లల్లో మిగిలిన రెండు మ్యాచ్ లు జరుగుతాయి. 21వ తేదీ నుంచి టీ20 ఇంటర్నేషనల్స్ ఆరంభం కానున్నాయి. ఈ రెండు సిరీస్ ల కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ.
మిడిలార్డర్ బ్యాటర్, వన్డే ఫార్మట్ వైస్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వంద శాతం ఫిట్ నెస్ సాధించాడు. దీంతో వడోదర మ్యాచ్ లో అతను ఆడటం దాదాపు ఖాయమైనట్టే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అతను గాయపడ్డ విషయం తెలిసిందే. క్యాచ్ పట్టబోయి కిందపడటంతో అతని పొత్తికడుపులో తీవ్ర గాయమైంది. ఫలితంగా కొద్దిరోజుల పాటు సిడ్నీలో ఐసీయూలో ఉండి చికిత్స తీసుకున్నాడు.

గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు దూరం అయ్యాడు. వన్డే సిరీస్ ఆరంభం కావడానికి ముందు మరోసారి గాయం బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు పడే వాడే. తాజాగా కుక్క కాటు నుంచి బయటపడ్డాడు. ఎయిర్ పోర్ట్ లో అభిమానులతో ముచ్చటిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.
అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తోన్న సమయంలో ఓ మహిళా అభిమాని తన కుక్కతో సహా అయ్యర్ వద్దకు వచ్చారు. ఆమె ఎత్తుకున్న బుజ్జి కుక్క పిల్లను ఆప్యాయంగా నిమరబోయాడు అయ్యర్. తన చేతిని దాని తల మీద ఉంచినప్పుడు అది అతని వేళ్లను చటుక్కున కరవబోయింది. దీంతో ఉన్నపళంగా చేతిని వెనక్కి లాక్కున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదృష్టం కొద్దీ ఆ కుక్కకాటు నుండి వేగంగా తప్పించుకోగలిగాడు. ఆ సమయంలో కొంత షాక్ కు గురైనట్టు కనిపించినప్పటికీ.. ఆ తర్వాత నవ్వుతూ వెళ్ళిపోయాడు. సుదీర్ఘ విరామం తర్వాత అయ్యర్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ వారం ప్రారంభంలో జైపూర్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌పై ముంబై తరఫున కేవలం 53 బంతుల్లో 82 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఆ తర్వాత పంజాబ్‌పైనా 45 పరుగులు చేశాడు.












Click it and Unblock the Notifications