Vaibhav Sooryavanshi: బేబీ బాస్ మరో రికార్డు - అతి చిన్న వయసులో..!!
భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు చాలామందే ఉన్నా..15 ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం మాత్రం అరుదైన ఘట్టమే.ఇప్పుడు ఆ ఘనతను యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అందుకున్నాడు.దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో అనూహ్యంగా లభించిన ఈ అవకాశం అతడి కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈస్ట్ జోన్,డిఫెండింగ్ ఛాంపియన్స్ సెంట్రల్ జోన్ మధ్య సెమీఫైనల్ జరుగుతోంది.తొలుత ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అయితే సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న కిషన్ కుడి మణికట్టుకు బంతి బలంగా తగలడంతో మైదానం వీడాల్సి వచ్చింది.ఫిజియోలు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కిషన్ మెరుగైన వైద్య పరీక్షల కోసం మైదానం వీడి బయటకు వెళ్లాడు.ఇషాన్ కిషన్ గ్రౌండ్‌ను వీడటంతో కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.

దీంతో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి.మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. అతడికి ఇది కేవలం రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్ మాత్రమే.ఇటీవలే వైస్ కెప్టెన్‌గా వైభవ్ ఎంపిక కావడం చర్చనీయాంశమైనప్పటికీ,భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈస్ట్ జోన్ సెలెక్టర్లు స్పష్టం చేశారు.ఇప్పుడు అదే నిర్ణయం ఎంత ముందుచూపుతో తీసుకున్నదో ఈ అనూహ్య కెప్టెన్సీ అవకాశం మరోసారి చాటింది.
గత సీజన్ రంజీ ట్రోఫీ సందర్భంగా వైభవ్‌ను బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా జట్టుకు కూడా వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇక బ్యాటింగ్‌లో వైభవ్‌కు దులీప్ ట్రోఫీ ఆరంభం ఆశించిన స్థాయిలో లేకపోయినా..నార్త్ ఈస్ట్ జోన్‌పై రెండు వికెట్లు తీసి బంతితో సత్తా చాటాడు.ఈస్ట్‌జోన్ పై బ్యాటింగ్ చేసిన ఈ చిచ్చరపిడుగు కేవలం 8 పరుగులకే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకవైపు ఇషాన్ కిషన్ గాయం..మరోవైపు 15 ఏళ్ల వైభవ్ చేతుల్లో జట్టు పగ్గాలు.ఇప్పుడు సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక సెమీఫైనల్లో యువ కెప్టెన్ ఎలా జట్టును నడిపిస్తాడన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.













Click it and Unblock the Notifications