Viral Video: ఏం ఫీలుంది మావా...పాక్ ఫ్యాన్ నోట జనగణమన గీతం..!!
ఆసియా కప్ క్రికెట్ ఫైనల్స్‌లో టీమిండియా అదరగొట్టింది. ఒకానొక సమయంలో భారత్ గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. కానీ మెన్ ఇన్ బ్లూ మాత్రం ఏ ఒక్క భారతీయుడిని నిరాశపర్చకుండా జట్టును చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయతీరాలకు చేర్చారు. అందులో మన తెలుగోడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభం నుంచి దాయాది దేశం పాకిస్తాన్ భారత్ మధ్య ఎన్నో వివాదాలు చెలరేగాయి. పహల్గాంలో పాక్ పాల్పడిన ఉగ్రదాడికి ప్రతీకారంగా టీమిండియా జట్టు కనీసం కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా రెచ్చగొట్టే తీరుతో గ్రౌండ్‌లో వ్యవహరించారు. కానీ సూర్యా భాయ్ టీమ్ ఎక్కడ ఎవరికి ఎప్పుడివ్వాలో అలానే ఇచ్చి పడేసింది. నోరెల్లబెట్టడం పాక్ వంతైంది.
ముచ్చటగా మూడు రాత్రులు.. అదేనండి మూడు ఆదివారాల రాత్రులు పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది టీమిండియా. పాకిస్తాన్ ఫైనల్స్‌లో తక్కువ స్కోరు చేసినప్పటికీ... డిఫెండ్ చేసే క్రమంలో పవర్ ప్లేలోనే మూడు కీలక భారత బ్యాట్స్‌మెన్‌ను పెవీలియన్‌కు చేర్చింది. ఇక భారత్ నిలదొక్కుకోవడం కష్టం అని అంతా భావిస్తున్న తరుణంలో తెలుగు సంచలనం తిలక్ వర్మ.. సంజూశాంసన్‌లు ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. సంజూ శాంసన్ ఔట్ అయ్యాక.. శివం దూబే తన బ్యాట్‌కు పని చెప్పాడు. పరుగులు పిండుకున్నాడు. ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిందే. భారత్ ఎలాగైతే ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు బుద్ది చెప్పిందో... ఆపరేషన్ తిలక్ ద్వారా పాకిస్తాన్ జట్టుకు టీమిండియా చెమటలు పట్టించింది. ఆ తర్వాత చరిత్రే.

ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు తమ తమ దేశాలకు చెందిన జాతీయ గీతాలు ఆలపిస్తాయి. ఆసియా కప్‌లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు భారత్ పాక్ జట్లు వారి దేశాలకు చెందిన జాతీయ గీతాన్ని ఆలపించాయి. ఈ సందర్భంగా భారత జాతీయ గీతం జనగణమణ పాట ప్రారంభం కాగానే ఓ పాక్ అభిమాని పొల్లు తప్పు పోకుండా చాలా చక్కగా పాడాడు. ఒక పాక్ అభిమాని అందునా భారత జాతీయ గీతం ఆలపించడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక భారత అభిమానులు ఈ వ్యక్తి పాడిన జాతీయగీతంకు ఫిదా అయ్యారు. ఏం ఫీలుంది మామా అంటూ సరదా కామెంట్లు పెట్టుకొచ్చారు.












Click it and Unblock the Notifications