Virat Kohli: విరాట్ కోహ్లీని చూసేందుకు ఎగబడిన ఫ్యాన్స్.. స్టేడియం వద్ద తోపులాట
Virat Kohli: ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఏదైనా అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడంటే అభిమానులు భారీగా తరలివస్తారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత విరాట్ దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగాడు. గురువారం సూరజ్ అహుజా నేతృత్వంలోని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తమ అభిమాన క్రికెటర్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.దాదాపు 10వేల మందికి పైగా వస్తారని భావించి ఏర్పాట్లు చేయగా.. అంతకు మించి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
స్టేడియంలోని 16వ గేట్ వద్ద అభిమానులు నెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కొందరు కింద పడిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీస్ శాఖకు సంబంధించిన ఓ బైక్ కూడా ధ్వంసమైంది. చాలా మంది బూట్లు, చెప్పులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ తోపులాటలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన అభిమానులకు డీడీసీఏ సెక్యూరిటీ, గేట్ దగ్గర ఉన్న పోలీసులు చికిత్స అందించారు. ఇదిలా ఉండగా.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు కూడా గాయపడ్డాడు.

అభిమానులు ఎక్కువగా వస్తారని ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారులు ముందే చెప్పడంతో పాటు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించారు. కానీ స్టేడియంలోకి అభిమానులను పంపేందుకు మూడు గేట్లు మాత్రమే తెరవాలని నిర్ణయించారు. అభిమానులు ఎక్కువగా వస్తారన తెలిసినా మూడు గేట్లు మాత్రమే తెరవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధిక రద్దీని చూసి చివరకు అదనపు గేట్ ను తెరిచారు.
ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్ కు దగ్గరగా ఉన్న గేట్లు 16, 17 బయట అభిమానులు ఉదయం 8 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. గేట్లు తెరవడానికి గంట ముందు నుంచే వేచి ఉన్నారు. 16వ గేట్ ను ఓపెన్ చేయాలని కొందరు యువకులు నెట్టడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో స్పల్పతోపులాట జరిగి ముగ్గురికి గాయాలయ్యాయి. చివరికి సెక్యూరిటీ అధికారులు వచ్చి గేట్ ఓపెన్ చేసి నెమ్మదిగా పంపించారు. రద్దీ నేపథ్యంలో కొందరు తమ పిల్లలను తమ భుజాలపైకి ఎత్తుకుని వచ్చారు. గాయపడిన వారిన చూసినవారు తమ వెనుక ఉన్న జనసమూహాన్ని అభ్యర్థించినా.. వారిని ఎవరూ పట్టించుకోలేదు. మ్యాచ్ ను చూసేందుకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురావాలని డీడీసీఏ సూచించింది. కానీ జనసందోహం ఎక్కువగా ఉండడంతో వాటిని చెక్ చేయకుండానే లోపలికి అనుమతించారు.
రైల్వేస్ తో మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని టాస్ గెలవగా.. ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో.. కోహ్లీ బ్యాటింగ్ కు రావడం లేదని తెలిసి నిరాశతో కొంతమంది అభిమానులు వెళ్లిపోవాలనుకున్నారు. అయితే వారిలో కొందరిని స్టాండ్ వదలివెళ్లడానికి అనుమతించలేదు. దీంతో అభిమానులు, భద్రతా అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి భద్రతా అధికారులు కొంతమంది అభిమానులను స్టాండ్స్ నుంచి బయటకు వెళ్లి గేట్ 16 సమీపంలోని ప్రాంతం నుంచి వారి బ్యాగులను తిరిగి పొందేందుకు అనుమతించారు. ప్రస్తుతం రైల్వేస్ జట్టు 34 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది.












Click it and Unblock the Notifications